పురుషులకూ జాతీయ కమిషన్‌!

దేశంలో పురుషుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

Published : 30 Jun 2023 03:53 IST

సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం...జులై 3న విచారణ

దిల్లీ: దేశంలో పురుషుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. పెళ్లైన మగవాళ్లలో బలవన్మరణాలు అధికంగా ఉంటున్నాయని, గృహ హింసే దీనికి ప్రధాన కారణమని న్యాయవాది మహేశ్‌ కుమార్‌ తివారీ తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ కేసు జులై 3న జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ముందుకు వస్తుందని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ పేర్కొంది. పిటిషనర్‌ తన వాదనలకు సమర్థనగా జాతీయ నేరాల నమోదు విభాగం(ఎన్‌సీఆర్‌బీ) డేటాను ఉటంకించారు.

ఎన్‌సీఆర్‌బీ 2021లో వెలువరించిన నివేదిక ప్రకారం...ఆ ఏడాది దేశం మొత్తం మీద 1,64,033 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో పురుషులు 1,18,979 కాగా మహిళలు 45,026 మంది, ఇతరులు 28 మంది.

బలవన్మరణాలకు పాల్పడిన 1,18,979 మంది మగవాళ్లలో పెళ్లైనవారు 81,068 మంది.

ఆత్మహత్యలకు పాల్పడిన 45,026 మంది మహిళల్లో వివాహితులు 28,680 మంది.

పెళ్లైన మగవాళ్లలో...33.2శాతం మంది ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు, 4.8శాతం మంది మృతికి వివాహ సంబంధిత వివాదాలు కారణమని పిటిషనర్‌ పేర్కొన్నారు.

పెళ్లైన మగవాళ్లలో ఆత్మహత్యలను నివారించడానికి గాను...గృహ హింసపై పురుషులు ఇచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకునేలా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ అభ్యర్థించారు.

వివాహం, కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడే పురుషులకు సంబంధించి తగు అధ్యయనం నిర్వహించి నివేదిక అందించేందుకు లా కమిషన్‌ను ఆదేశించాలని కోరారు. ఆ నివేదిక ఆధారంగా పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం చట్టం రూపొందించే వరకూ గృహహింస, కుటుంబ సమస్యలపై పురుషులు ఇచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకునేలా పోలీసులను ఆదేశించాలన్నారు. రాష్ట్రాల్లోని మానవ హక్కుల కమిషన్లకు కూడా తగు ఉత్తర్వులివ్వాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని