బంగారం అక్రమ రవాణాకు భారతీయ వలస కార్మికులు!

బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు సింగపూర్‌లోని స్మగ్లరు భారతీయ వలస కార్మికులను కూలికి (గోల్డ్‌ మ్యూల్స్‌గా) నియమించుకుంటున్నారని ఆదివారం ఓ మీడియా కథనం పేర్కొంది.

Updated : 18 Dec 2023 05:44 IST

సింగపూర్‌ చాంగీ విమానాశ్రయంలో నియమించుకుంటున్న స్మగ్లర్లు
మీడియా కథనంలో వెల్లడి

సింగపూర్‌: బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు సింగపూర్‌లోని స్మగ్లరు భారతీయ వలస కార్మికులను కూలికి (గోల్డ్‌ మ్యూల్స్‌గా) నియమించుకుంటున్నారని ఆదివారం ఓ మీడియా కథనం పేర్కొంది. చాంగీ విమానాశ్రయం నుంచి భారత్‌కు బయలుదేరే భారతీయ కార్మికులను ఈ మేరకు స్మగ్లర్లు సంప్రదిస్తున్నారని, తాము ఇచ్చిన బంగారాన్ని భారత్‌కు తీసుకెళ్లి అప్పగిస్తే వారికి కొంత రుసుము చెల్లిస్తున్నారని వెల్లడించింది. బంగారం రవాణాకు ఆసక్తి చూపిన వారిని విమానాశ్రయంలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళుతున్నారని, అక్కడ ఒప్పందం కుదురుతోందని తెలిపింది. సాధారణంగా 25 గ్రాముల నుంచి 30 గ్రాముల బంగారాన్ని పంపేందుకు స్మగ్లర్లు ఆసక్తి చూపుతున్నారని ‘ద స్ట్రెయిట్స్‌ టైమ్స్‌’ తన కథనంలో వెల్లడించింది.  సింగపూర్‌ నుంచి విదేశాలకు బంగారం, ఇతర విలువైన రాళ్లను తీసుకెళ్లడం చట్ట వ్యతిరేకం కానప్పటికీ, కార్మికులు మాత్రం భారత్‌లో దిగిన తర్వాత ఒక్కోసారి చట్ట ఉల్లంఘనలకు పాల్పడాల్సి వస్తుందని జెమ్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సింగపూర్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిలాల్‌ తెలిపారు. బంగారం తీసుకొస్తున్న సంబంధిత కార్మికులు ఆ విషయాన్ని ముందుగా వెల్లడించకపోవడమే ఇందుకు కారణమన్నారు. కార్మికుల ద్వారా బంగారాన్ని తరలించడం దశాబ్దాలుగా ఉన్నదేనని బిలాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే భారతీయులు పురుషులైతే 20 గ్రాముల వరకు సుంకం చెల్లించకుండా బంగారాన్ని తమ వెంట తెచ్చుకోవచ్చు. మహిళల విషయంలో ఈ పరిమితి రెట్టింపు. ఈ పరిమితులకు మించి బంగారం తీసుకొస్తే మాత్రం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, సింగపూర్‌ నుంచి విదేశాలకు ఎంత పరిమాణంలోనైనా బంగారం, ఇతర విలువైన రాళ్లను తరలించవచ్చు. బంగారం అక్రమ రవాణాపై భారత అధికారులు దృష్టి పెడుతుండడంతో స్మగ్లర్లు సింగపూర్‌, మలేసియా సహా గల్ఫ్‌, ఆసియాల్లోని వివిధ విమానాశ్రయాల్లోని ప్రయాణికులను సంప్రదిస్తున్నారని ‘ద స్ట్రెయిట్స్‌ టైమ్స్‌’ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని