icon icon icon
icon icon icon

పదహారేళ్లుగా పోరాటం!

ఎన్నికలనగానే గెలుపు గురించే చాలామంది రాజకీయ నేతలు ఆలోచిస్తుంటారు. కానీ ఓ నాయకుడు ఇందుకు భిన్నం! ఆయన పోరాటం గురించి మాత్రమే ఆలోచిస్తారు.

Updated : 28 Apr 2024 06:28 IST

ఏడోసారి ఎన్నికల బరిలో దిగుతున్న గిరిజన నాయకుడు  
పాల్ఘర్‌ నుంచి పోటీ చేస్తున్న మోహన్‌ గుహే

ఎన్నికలనగానే గెలుపు గురించే చాలామంది రాజకీయ నేతలు ఆలోచిస్తుంటారు. కానీ ఓ నాయకుడు ఇందుకు భిన్నం! ఆయన పోరాటం గురించి మాత్రమే ఆలోచిస్తారు. పేరు- మోహన్‌ గుహే! గత పదహారేళ్లలో ఆయన నాలుగుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు లోక్‌సభకు పోటీ చేశారు. ఇప్పుడు ఏడోసారి మహారాష్ట్రలోని పాల్ఘర్‌ లోక్‌సభ స్థానం నుంచి భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.

సాధారణ ప్రైవేటు ఉపాధ్యాయుడు

మోహన్‌ గిరిజన నాయకుడు. తమ వర్గం నేతలు సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో చట్టసభల్లో అడుగుపెట్టాలనేది ఆయన కోరిక. అందులో భాగంగానే తానూ చట్టసభల్లో ప్రవేశించాలనే పట్టుదలతో ఉన్నారు. నిజానికి ఈయన సాధారణ ప్రైవేటు ఉపాధ్యాయుడు. ఠానేలోని ఓ స్కూలులో పనిచేస్తున్నారు. తన వేతనం నుంచి ఏటా రూ.1-2 లక్షలు పొదుపు చేస్తుంటారు. దానికితోడు కొన్ని విరాళాలు సేకరించి ఎన్నికల్లో పోటీకి దిగుతారు. 16 ఏళ్లుగా మోహన్‌ చేస్తున్నదిదే. ఏదో ఒకరోజు తాను తప్పకుండా చట్టసభలోకి అడుగుపెడతానని ఆయన ఆత్మవిశ్వాసంతో  చెబుతున్నారు.

నీటి సమస్య తీరుస్తానంటూ..

పాల్ఘర్‌లో అయిదు ఆనకట్టలు ఉన్నప్పటికీ నేటికీ జిల్లా ప్రజలు నీటి కొరతతో అల్లాడుతున్నారు. తనను గెలిపిస్తే ఆ సమస్యను తీరుస్తానంటూ ఓటర్లకు మోహన్‌ భరోసా ఇస్తున్నారు. ఆయన భార్య ఒక నర్సు. అందువల్ల ఆయనకు ఆరోగ్య రంగంపై మంచి అవగాహన ఉంది. పాల్ఘర్‌ లోక్‌సభ పరిధిలోని గ్రామాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చక్కగా ప్రసంగిస్తుంటారు. నాసిక్‌-దహను మార్గంలో రైల్వేలైన్‌ నిర్మాణ ప్రాజెక్టు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. తనను గెలిపిస్తే దీనిపై కేంద్రప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన అంటున్నారు. స్థానిక మత్స్యకారులకు కీలకమైన వద్వాన్‌ పోర్టుకు సంబంధించిన అంశాన్నీ మోహన్‌ లేవనెత్తుతున్నారు. 2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్‌కు 8 వేల ఓట్లు వచ్చాయి. అదే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో 13,500 ఓట్లు దక్కించుకున్నారు.

ఈటీవీ భారత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం