icon icon icon
icon icon icon

Congress candidate: ‘ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు’.. లోక్‌సభ అభ్యర్థి వ్యాఖ్యలతో షాకైన జనం

Congress candidate: మహిళల కోసం పథకాన్ని ఉద్దేశిస్తూ ఓ కాంగ్రెస్‌ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇద్దరు భార్యలుంటే ఏటా రూ.2 లక్షలు తీసుకోవచ్చని ఆయన చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు.

Published : 10 May 2024 13:17 IST

రత్లాం: ఈ సార్వత్రిక ఎన్నికల (Lok sabha Elections)కు కాంగ్రెస్‌ తమ మేనిఫెస్టోలో ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రత్యేకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తే పేద కుటుంబాల్లోని మహిళలకు ఏటా రూ.లక్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చింది.  తాజాగా కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి (Congress candidate) ఒకరు ఈ పథకం గురించి చేసిన వ్యాఖ్యలతో జనం కంగుతిన్నారు.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ (Congress) నేత కాంతిలాల్‌ భురియా (Kantilal Bhuria) తాజా ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని రత్లాం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఓ సభలో మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం (Mahalaxmi scheme) గురించి ప్రస్తావించారు. ‘‘ప్రతి మహిళకు రూ.లక్ష ఇస్తామని మా మేనిఫెస్టోలో ప్రకటించాం. ఒకవేళ ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే.. ఆ ఇద్దరూ ఈ పథకం కింద చెరో రూ.లక్ష చొప్పున ప్రయోజనం పొందేందుకు అర్హులే’’ అని భురియా అన్నారు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.

‘పాక్‌ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యల దుమారం

ఆ సమయంలో మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జితూ పట్వారీ కూడా వేదికపైనే ఉన్నారు. భురియా వ్యాఖ్యలు వినగానే జితూ స్పందిస్తూ.. ‘ఇది చాలా భయంకరమైన ప్రకటన’ అంటూ దిద్దుబాటు చర్యలకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి వ్యాఖ్యలను భాజపా (BJP) నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

73 ఏళ్ల కాంతిలాల్‌ భురియా గతంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో ఆయనపై భాజపా నుంచి రాష్ట్ర మంత్రి నాగర్‌ సింగ్‌ చౌహన్‌ సతీమణి అనిత బరిలోకి దిగారు. రత్లాం స్థానానికి నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img