icon icon icon
icon icon icon

కన్నౌజ్‌ పోరు.. ‘అత్తరు’ గుబాళింపు ఎటువైపో ?

మే 13న జరిగే పోలింగ్‌లో కన్నౌజ్‌ ‘అత్తరు’ తయారీదారుల మద్దతు ఎవరివైపు ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Published : 11 May 2024 00:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో కీలక పార్లమెంటు స్థానాల్లో కన్నౌజ్‌ ఒకటి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, సిటింగ్‌ ఎంపీ సుబ్రత్‌ పాఠక్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లలో స్వల్ప తేడానే ఉండడంతో ఈసారి (Lok Sabha Elections) కూడా గట్టి పోటీ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ‘అత్తరు’ తయారీకి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో బంగాళదుంప రైతులు కూడా ఎక్కువే. నేతలు తమ సమస్యలు వినకపోతారా? అని స్థానిక ఓటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో మే 13న జరిగే పోలింగ్‌లో కన్నౌజ్‌ ‘అత్తరు’ తయారీదారుల మద్దతు ఎవరివైపు ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.

హామీలు నెరవేర్చాలని..

‘సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అత్తరు తయారీదారులు ఉపయోగించే ముడి సరకులపై పన్ను రాయితీ కల్పించారు. కానీ, భాజపా ప్రభుత్వం జీఎస్టీ పేరుతో 18శాతం పన్ను వసూలు చేస్తోంది. పర్ఫ్యూమ్‌ యూనిట్ల ఏర్పాటులో రాయితీ ఇవ్వడంతోపాటు చిన్న వ్యాపారస్తులకు ఈ పార్కులో అవకాశం కల్పించాలి’ అని సంబంధిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గత ఐదేళ్లలో ఇక్కడ అభివృద్ధి జరగలేదని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు’.. లోక్‌సభ అభ్యర్థి వ్యాఖ్యలతో షాకైన జనం

‘స్థానికంగా బంగాళదుంప ఎక్కువగా పండుతుంది. అవి వృథా కాకుండా ఉండేందుకు పరిశ్రమలు ఏర్పాటుచేయాలని ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్నాం. ఇదే అంశంపై గత ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చినప్పటికీ    ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తమ దగ్గర 200 కోల్డ్‌ స్టోరేజీలు ఉన్నప్పటికీ దిగుబడి ఎక్కువైన సందర్భాల్లో పంటను పారబోయాల్సి వస్తోంది. గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు చిప్స్‌, స్టార్చ్‌ ఫ్యాక్టరీలు నెలకొల్పాలి’ అని స్థానిక రైతులు డిమాండు చేస్తున్నారు.

అఖిలేశ్‌ ఆశలు..

1967 దశకంలో ప్రముఖ సామాజికవేత్త రామ్‌మనోహర్‌ లోహియా గెలిచిన కన్నౌజ్‌ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్‌ గతంలో మూడుసార్లు విజయం సాధించారు. 2000, 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన యాదవ్‌.. 2012లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఈ స్థానాన్ని వీడారు. ఆ ఉప ఎన్నికల్లో ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014లోనూ ఆమె విజయం సాధించినప్పటికీ.. 2019లో భాజపా అభ్యర్థి సుబ్రత్‌ పాఠక్‌ చేతిలో ఓడిపోయారు. ఈసారి డింపుల్‌ మైన్‌పురి బరిలో నిలవగా.. అఖిలేశ్‌ కన్నౌజ్‌లో పోటీ చేస్తున్నారు. భాజపా అభ్యర్థి పాఠక్‌ గట్టి పోటీ ఇస్తున్నారు.

కన్నౌజ్‌ నియోజకవర్గంలో మొత్తం 19 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 3 లక్షల మంది ముస్లింలు ఉన్నట్లు అంచనా. బ్రాహ్మణులు, యాదవ్‌లు 2.5 లక్షల చొప్పున ఉండగా.. మరో 4 లక్షలకు పైగా దళితులు ఉన్నారు. గతంలో ఎంపీగా స్థానికంగా చేసిన పనులను ఎస్పీ అధినేత అఖిలేశ్‌ వివరిస్తుండగా.. భాజపా నేత పాఠక్‌ మాత్రం రాష్ట్రంలో, కేంద్రంలో తమ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img