పోలీసు సమన్లను పట్టించుకోవద్దు

లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్‌కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌.. రాజ్‌భవన్‌ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు.

Published : 06 May 2024 04:23 IST

రాజ్‌భవన్‌ ఉద్యోగులకు బెంగాల్‌ గవర్నర్‌ స్పష్టీకరణ

కోల్‌కతా: లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్‌కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌.. రాజ్‌భవన్‌ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. గవర్నర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోల్‌కతా పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో గవర్నర్‌ ఈ మేరకు స్పందించారు. రాజ్యాంగంలోని 361 (2), (3) అధికరణం ప్రకారం.. గవర్నర్‌పై విచారణ, దర్యాప్తుకు ఎలాంటి చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర పోలీసులకు లేదని ఆనంద బోస్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘‘పదవిలో ఉండగా రాష్ట్రపతి, గవర్నర్లపై ఎలాంటి క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ చేపట్టడానికి వీల్లేదు. అరెస్టు, జైల్లో పెట్టడానికి ఎలాంటి ప్రక్రియను చేపట్టకూడదు’’ అని రాజ్‌భవన్‌ ఉద్యోగులకు పంపిన సందేశంలో తెలిపారు. మహిళా ఉద్యోగి ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా కొద్ది రోజుల్లో సాక్షులను పోలీసు బృందం ప్రశ్నించనుంది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా సమర్పించాలని కోరింది. రాజ్‌భవన్‌లోని ముగ్గురు అధికారులు, అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసును విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని