సిసోదియా నివాసంలో సీబీఐ సోదాలు

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా నివాసం సహా దేశంలో ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించింది. సిసోదియా అనుచరుడి కంపెనీకి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి

Published : 20 Aug 2022 04:11 IST

ఆయన అనుచరుడికి రూ.కోటి అందినట్లు ఎఫ్‌ఐఆర్‌

దిల్లీ, ఈనాడు-హైదరాబాద్‌: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా నివాసం సహా దేశంలో ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించింది. సిసోదియా అనుచరుడి కంపెనీకి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి చెల్లించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. దిల్లీ ఎక్సైజ్‌ విధానంతో ముడిపడిన ఈ సోదాలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), భాజపా మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. తమ ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతుండడంతో ఓర్వలేక కేంద్రం ఇలా భయపెట్టాలని చూస్తోందని ఆప్‌ విమర్శించింది. ఆప్‌ సీనియర్‌ నేత సిసోదియా.. విద్యాశాఖతో పాటు ఎక్సైజ్‌ శాఖనూ చూస్తున్నారు. నవంబరులో తీసుకువచ్చిన నూతన ఎక్సైజ్‌ విధానంపై ఆరోపణలు రావడంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా సిఫార్సు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి, రంగంలో దిగింది.

మద్యం వ్యాపారులకు మేలు చేశారా?

లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి కలిగేలా టెండర్ల ప్రక్రియ తర్వాత ఉద్దేశపూర్వకంగా విధానపరమైన మార్పుల్ని చేశారని, కరోనా పేరుతో రూ.144.36 కోట్ల ఫీజు మాఫీ చేశారనేది ఒక ఆరోపణ. మద్యం చిల్లర వ్యాపారం నుంచి ప్రభుత్వం వైదొలగడం, తెల్లవారుజాము 3 వరకు బార్లు తెరచి ఉంచేందుకు అనుమతించడం వంటివీ అనుమానాలకు తావిచ్చాయి. సిసోదియాతో పాటు ఐఏఎస్‌ అధికారి అరవ గోపీకృష్ణ (ఎక్సైజ్‌ మాజీ కమిషనర్‌) నివాసంలో, మరో ఇద్దరు అధికారుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సోమశిలకు చెందిన గోపీకృష్ణ 2012 బ్యాచ్‌ సివిల్స్‌ అధికారి. సీబీఐ అధికారులు దిల్లీ, ముంబయి, చండీగఢ్‌, హైదరాబాద్‌, బెంగళూరు తదితర నగరాల నుంచి పెద్దఎత్తున పత్రాలు, డిజిటల్‌ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సిసోదియా కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్‌ కూడా ఉన్నాయి. మొత్తంగా 13 మంది వ్యక్తులు, రెండు కంపెనీల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. తగిన అనుమతి తీసుకోకుండానే విధానాన్ని ప్రకటించారనీ, లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి కలిగించడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేంద్ర కార్యాలయానికి పంపినట్లు సమాచారం. అక్రమ నగదు చలామణి కోణంలో త్వరలో ఈడీ కూడా కేసు నమోదు చేసి.. దర్యాప్తు మొదలు పెట్టనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

సిసోదియా ఉత్తమ విద్యా మంత్రి: కేజ్రీవాల్‌

ఉన్నతస్థాయి ఒత్తిళ్ల కారణంగానే సిసోదియాపై సోదాలు జరిగాయనీ, ప్రపంచంలోనే ఆయన ఉత్తమ విద్యామంత్రి అని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విలేకరులకు చెప్పారు. దిల్లీ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికలో ప్రముఖంగా కథనం వచ్చినరోజే సోదాలు జరిగాయన్నారు. దిల్లీ విద్యా విధానంపై తమ కథనం నిష్పాక్షికమైనదని, ఖలీజ్‌ టైమ్స్‌లోనూ ప్రచురితమైనంత మాత్రాన అది చెల్లింపు వార్త కానేకాదని న్యూయార్క్‌ టైమ్స్‌ వివరణ ఇచ్చింది.

హైదరాబాద్‌లో రాత్రి 8 వరకు..

ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్‌లో మొదలైన సోదాలు రాత్రి 8 వరకూ కొనసాగాయి. కేసులో నిందితునిగా పేర్కొన్న రామచంద్ర పిళ్లై శాశ్వత చిరునామా హైదరాబాద్‌ కోకాపేటలోని ఈడెన్‌ గార్డెన్స్‌గా పేర్కొన్నారు. దీని ఆధారంగా దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం స్థానిక అధికారుల సహకారంతో పిళ్లై నివాసంలో సోదాలు నిర్వహించింది. బెంగళూరుకు చెందిన పిళ్లై.. దిల్లీతో సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని