Kerala Governor: రాజీనామా చేయండి.. తొమ్మిది మంది వీసీలకు గవర్నర్‌ ఆదేశం!

కేరళలో విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్స్‌లర్‌ల నియామకం విషయంలో అధికార ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది! తాజాగా రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Published : 24 Oct 2022 01:29 IST

తిరువనంతపురం: కేరళలో విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్స్‌లర్‌(VC)ల నియామకం విషయంలో అధికార ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌(Arif Mohammed Khan) ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 11.30కల్లా రాజీనామాలు తనకు చేరాలని గవర్నర్‌ ఆదేశించినట్లు రాజ్‌భవన్ తెలిపింది.

యూజీసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ.. కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ నియామకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. ఈ ఉత్తర్వులను ఉటంకిస్తూ.. గవర్నర్‌ తాజాగా రాష్ట్రంలోని తొమ్మిది వర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని కోరారు. గవర్నర్ తరఫున కేరళ రాజ్‌భవన్ ఆదివారం ఈ మేరకు ట్వీట్‌ చేసింది. ఈ తొమ్మిది మంది వీసీల జాబితాలో ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్‌ వర్సిటీ వీసీ కూడా ఉన్నారు.

కొంతకాలంగా పినరయి విజయన్‌ సర్కారు, గవర్నర్‌కు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కారుపై గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ శనివారం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మద్యం, లాటరీని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డారు. ఇది వింటుంటే తనకే సిగ్గుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌కు అడ్డాగా ఉన్న పంజాబ్‌ను త్వరలోనే కేరళ దాటేయబోతోందని కూడా గవర్నర్‌ వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని