CM Stalin: గవర్నర్‌ వైఖరిపై మండిపడ్డ స్టాలిన్‌

రాష్ట్ర గవర్నర్ల (Governor) తీరుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (Stalin) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు గవర్నర్ల తీరు చూస్తుంటే వారికి నోరు మాత్రమే ఉందని, చెవులు లేనట్లు కనిపిస్తోందని విమర్శించారు.

Published : 09 Mar 2023 19:11 IST

చెన్నై: కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు (Governor), ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ల పనితీరుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (Stalin) మరోసారి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల పరిస్థితులు చూస్తుంటే కొందరు గవర్నర్లు ఎక్కువగా మాట్లాడుతూ.. తక్కువ వింటున్నట్లు కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్‌ జూద నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం (Tamil Nadu) రూపొందించిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్‌ తిప్పి పంపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ విధంగా స్పందించడం గమనార్హం.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ‘ఉంగలిల్‌ ఒరువన్‌ (Ungalil Oruvan)’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు వీడియో ద్వారా సమాధానాలు ఇచ్చారు. ‘ఇటీవల గవర్నర్ల చర్యలు చూస్తుంటే వారికి నోరు మాత్రమే ఉంది, చెవులు లేనట్లు కనిపిస్తోంది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇక దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా అరెస్టుపై స్పందించిన స్టాలిన్‌.. విపక్షాలను భాజపా బెదిరింపులకు గురిచేస్తుందనడానికి స్పష్టమైన ఉదాహరణ అని అన్నారు. సిసోదియా అరెస్టును ఖండించిన ఆయన.. రాజకీయ కారణాల కోసమే దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు. ఇక రాష్ట్రంలో వలస కార్మికులపై ఇటీవల వస్తోన్న వదంతులపై స్పందించిన స్టాలిన్‌.. ఉత్తరాదికి చెందిన కొంతమంది భాజపా నేతలే దురుద్దేశంతో ఇటువంటి తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని ఆరోపించారు.

మరోవైపు ఆన్‌లైన్‌ జూదానికి వ్యతిరేకంగా రూపొందించిన బిల్లును గవర్నర్‌ ఎందుకు వెనక్కి పంపించారో తెలియదని తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్‌ రేగుపతి పేర్కొన్నారు. బిల్లును తిప్పిపంపడానికి గవర్నర్‌ చెప్పిన కారణాలను వెల్లడిస్తే సీఎం స్టాలిన్‌ పరిశీలించే అవకాశం ఉంటుందన్నారు. బిల్లును అసెంబ్లీ మళ్లీ పంపిస్తే ఆమోదం తెలపడం గవర్నర్‌ బాధ్యత అని న్యాయశాఖ మంత్రి స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి మధ్య ఘర్షణ వాతావరణం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా కనిపించింది. అసెంబ్లీలో ప్రసంగం సమయంలో ప్రభుత్వ నివేదికలోని కొన్ని పేరాలను గవర్నర్‌ వదిలేసి చదవడం వివాదానికి కారణమయ్యింది. దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని