₹3.25 లక్షల కోట్ల అదనపు వ్యయం.. పార్లమెంట్‌ అనుమతి కోరిన కేంద్రం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3.25 లక్షల కోట్ల అదనపు నిధుల వ్యయానికి కేంద్రం (Govt) పార్లమెంట్‌ (Parliament) అనుమతి కోరింది.

Published : 10 Dec 2022 00:39 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3.25 లక్షల కోట్ల అదనపు నిధుల వ్యయానికి కేంద్రం (Govt) పార్లమెంట్‌ (Parliament) అనుమతి కోరింది. ఈ మొత్తంలో రూ.1.09 లక్షల కోట్లు ఒక్క ఎరువుల రాయితీ కోసం చెల్లించనున్నట్లు పార్లమెంట్‌కు నివేదించింది. దీంతో పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీకి చేసే ఖర్చు కోసం ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.80,348.25 కోట్లు కావాలని పేర్కొంది.

ఇవి కాకుండా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు చెల్లించాల్సిన ఎల్పీజీ సబ్సిడీని, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేదలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లతో పాటు ఇతర ఖర్చుల కోసం పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖకు రూ.29,944 కోట్ల మేర అదనపు నిధులు కావాలని పేర్కొంది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి అడిషనల్‌ గ్రాంట్స్‌ కోసం పార్లమెంట్‌ అనుమతి కోరారు. మొత్తంగా రూ.4.36 లక్షల కోట్ల స్థూల అదనపు వ్యయాల కోసం అనుమతి కోరగా.. ఇందులో నగదు రూపంలో రూ.3.25 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని కేంద్రం పేర్కొంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ లక్ష్యానికి మించి ఖర్చు చేసినప్పుడు అదనపు నిధుల కోసం కేంద్రం పార్లమెంట్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని