China Corona: చైనాలో కరోనా ఎందుకు ఉద్ధృతి చూపిస్తుందో తెలుసా..?

కరోనా వైరస్‌ను మొదట గుర్తించిన చైనాలో మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. 2019 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో ఉద్ధృతి చూపిస్తోంది.

Updated : 02 May 2022 12:53 IST

ముంబయి: కరోనా వైరస్‌ను మొదట గుర్తించిన చైనాలో మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. 2019 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో ఉద్ధృతి చూపిస్తోంది. దాంతో పలు నగరాలు కఠిన ఆంక్షల చట్రంలో బందీగా ఉన్నాయి. అసలు ఇప్పుడు అక్కడ ఎందుకు వైరస్‌ విజృంభిస్తుందనే ప్రశ్నకు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా చమత్కారంగా సమాధానం ఇచ్చారు. 

‘ఈ రోజుల్లో చైనాలో కరోనా తీవ్రతకు కారణం ఏంటని నేను హర్షానంద స్వామిని అడిగాను. ‘వైరస్‌ అలసిపోయింది. అందుకే వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయాలనుకుంటోంది’ అని ఆయన సమాధానమిచ్చారు’ అంటూ హర్ష సరదాగా ట్వీట్ చేశారు. మహమ్మారిని మొదట చైనాలోని వుహాన్‌ నగరంలో గుర్తించిన విషయాన్ని ఉద్దేశిస్తూ, అలాగే కరోనా కారణంగా సంస్థల్లో మారిన పనితీరును ప్రస్తావిస్తూ ఆయన ఈ విధంగా స్పందించారు. 

ఇదిలా ఉండగా.. చైనాలో ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలో కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం షాంఘైలో కేసులు తగ్గుముఖం పడుతోన్న సమయంలో బీజింగ్‌లో కేసులు పెరుగుతున్నాయి. దాంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు రెస్టారెంట్లలో భోజనం చేయొద్దంటూ నిషేధం విధించింది. కరోనా వైరస్ వెలుగుచూసిన ఇళ్లు, భవనాలను సీల్‌ చేస్తోంది. పర్యాటకులకు కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేసింది. షాంఘై తరహా పరిస్థితుల్ని నివారించేందుకు ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. షాంఘై నగరంలో లాక్‌డౌన్ కారణంగా అక్కడి ప్రజలు ఆకలితో అల్లాడిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆంక్షలతో విసిగిపోయిన ప్రజల నిరసన స్వరాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఇక ప్రస్తుతం ఈ నగరంలో పాజిటివ్‌ల సంఖ్య దిగొస్తోంది. వరుసగా రెండో రోజు 10 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని