Odisha Train Tragedy: తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి..

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో హృదయ విదారక ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒడిశాలోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేశ్‌ జెన అనే యువకుడు తన తల్లి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై నుంచి బాలేశ్వరం వచ్చాడు.

Updated : 03 Jun 2023 14:07 IST

కటక్: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో హృదయ విదారక ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒడిశాలోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేశ్‌ జెన అనే యువకుడు తన తల్లి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై నుంచి బాలేశ్వర్‌ వచ్చాడు. తిరిగి చెన్నై వెళ్తుండగా.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మృతి చెందాడు. 

మృతుడి సోదరుడు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అన్నయ్య రమేశ్‌ 14 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. తల్లి చనిపోయాక 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు. నాలుగు రోజుల క్రితం తల్లి పెద్దకర్మ జరిగింది. తిరిగి చెన్నై బయలుదేరాడు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి రైల్వేస్టేషన్‌లో నేను విడిచి పెట్టాను. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాక ఫోన్ చేస్తానని తెలిపాడు. నన్ను వెళ్లిపోమన్నాడు. అయితే.. రాత్రి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైందని సమాచారం తెలుసుకుని రమేశ్‌కు ఫోన్ చేయగా తీయలేదు. కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేయగా ఎవరో వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ రమేశ్‌ మృతి చెందినట్లు తెలిపాడు. వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చి సోదరుడి కోసం గాలించాను. అక్కడ ఉన్న అధికారులు మృతదేహాలను ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. ఏ ఆస్పత్రిలో ఉన్నాడో వివరాలు లభించక బాలేశ్వర్ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి వచ్చాను. అక్కడ మృతదేహం చూసి ఆవేదన చెందాను’’ అని బోరున విలపించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని