Hemant Soren: సతీమణికి పగ్గాలు..? లాలూ బాటలోనే హేమంత్‌ సోరెన్!

హేమంత్‌ సతీమణి కల్పనా సోరెన్‌కు పగ్గాలు అప్పచెప్పనున్నారనే వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. 26ఏళ్ల క్రితం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీసుకున్న నిర్ణయాలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

Published : 30 Jan 2024 20:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు ముమ్మరం చేయడం, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కావడం అక్కడి రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ముఖ్యంగా సతీమణి కల్పనా సోరెన్‌కు హేమంత్‌ పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రెండున్నర దశాబ్దాల క్రితం బిహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం అవుతున్నాయనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో లాలూ ప్రసాద్‌ నడిచిన బాటలోనే ఇప్పుడు హేమంత్‌ పయనిస్తున్నారా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రీయ జనతాదళ్‌ (RJD) అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం వెలుగుచూసింది. లాలూపైనా ఆరోపణలు వచ్చాయి. చివరకు ఆయనకు అరెస్టు వారెంట్‌ జారీ కావడంతో ముఖ్యమంత్రి పదవికి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో సతీమణి రబ్రీ దేవీని రంగంలోకి దించారు. జులై 25, 1997లో బిహార్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. 2005 వరకు అధికారంలో కొనసాగారు. అప్పట్లో లాలూ ప్రసాద్‌ తీసుకున్న నిర్ణయంపై  విమర్శలు కూడా వచ్చాయి. కేవలం అధికారంలో ఉండాలనే కాంక్షతోనే అలా చేశారనే ఆరోపణలనూ ఆర్జేడీ అధినేత ఎదుర్కొన్నారు.

30 గంటల పాటు సీఎం ‘మిస్సింగ్‌’.. నాడు తండ్రి శిబు కూడా..!

తాజాగా ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని భాజపా ఆరోపించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేస్తుందనే భయం సోరెన్‌లో నెలకొందని పేర్కొంది. అందుకే తన కుటుంబాన్ని అధికారంలో ఉంచేందుకు సతీమణికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పాలని సోరెన్‌ చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కల్పనా సోరెన్‌ ఎమ్మెల్యే అయ్యేందుకు మార్గాలు కూడా జేఎంఎం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ పార్టీ ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ కొన్ని రోజుల క్రితమే (జనవరి 2, 2024) రాజీనామా చేశారు. ఒకవేళ హేమంత్‌ సోరెన్‌ అరెస్టు అయితే, కల్పనా ఇక్కడినుంచే పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని