IIT Delhi: విద్యార్థులపై పరీక్షల భారం.. ‘ఐఐటీ దిల్లీ’ కీలక నిర్ణయం!

విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు ‘ఐఐటీ దిల్లీ’ కీలక నిర్ణయం తీసుకుంది. సెమిస్టర్‌లో ఒక సెట్ మిడ్-సెమిస్టర్ పరీక్షను రద్దు చేసినట్లు వెల్లడించింది.

Published : 13 Aug 2023 15:52 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆయా ఐఐటీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలు కలవరపెడుతున్నాయి. వ్యక్తిగత సమస్యలతోపాటు చదువులు, పరీక్షల ఒత్తిడి కూడా విద్యార్థుల బలవన్మరణాలకు కారణమవుతోందనే వాదనలు ఉన్నాయి. ఈ పరిణామాల నడుమ ఐఐటీ దిల్లీ (IIT Delhi) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారిపై పరీక్షల భారాన్ని తగ్గించేందుకు.. తన పరీక్షా విధానంలో మార్పులు చేపట్టింది. ఈ క్రమంలోనే ఒక సెట్ మిడ్-సెమిస్టర్ పరీక్షను రద్దు చేసినట్లు ఐఐటీ దిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ వెల్లడించారు.

‘ఇదివరకు ఒక సెమిస్టర్‌లో రెండు సెట్ల పరీక్షలు, ఫైనల్ ఎగ్జామ్‌తోపాటు క్విజ్‌, అసైన్‌మెంట్స్‌ వంటి మూల్యాంకనాలు ఉండేవి. దీంతో పరీక్షల క్యాలెండర్‌ అతిగా నిండిపోయింది. ఈ నేపథ్యంలో విద్యార్థులపై పరీక్షల భారం తగ్గించాలని నిర్ణయించాం. ఈ విషయంలో అంతర్గతంగా సర్వే నిర్వహించి.. ఫ్యాకల్టీ, విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాం. దీని ఆధారంగా ఒక సెట్‌ మిడ్-సెమిస్టర్ పరీక్షను తొలగించాలని నిర్ణయించాం. మిగతావన్నీ యథాతథంగా ఉంటాయి. ప్రస్తుతం కొనసాగుతోన్న సెమిస్టర్ నుంచే ఇది అమల్లోకి వస్తుంది’ అని బెనర్జీ ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘దేశాభివృద్ధి కోసం యువత అంకితమవ్వాలి’

ఆత్మహత్యల నివారణకుగానూ.. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెంపొందేలా కౌన్సెలింగ్‌ అందించడం, మెంటార్‌లను నియమించడం వంటి చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో ఐఐటీల్లో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫిబ్రవరిలో ఐఐటీ మద్రాస్‌లో ఒకరు, ఐఐటీ బాంబేలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. మార్చిలో ఐఐటీ మద్రాస్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి, ఏప్రిల్‌లో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత నెలలో ఐఐటీ దిల్లీలో బీటెక్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని