Viral News: రైలు పట్టాలపై పడిన బాలిక కోసం ప్రాణాలకు తెగించి..!

పట్టాలపై పడి మృత్యుఅంచువరకు వెళ్లిన ఓ బాలిక కోసం ఓ వ్యక్తి ఒళ్లు గగుర్పొడిచే సాహసమే చేశాడు. అతడు తన ప్రాణాలను పణంగా పెట్టి, రైలుకు ఎదురెళ్లిన తీరు గుండె వేగాన్ని పెంచుతోంది.

Updated : 12 Feb 2022 17:22 IST

భోపాల్‌: పట్టాలపై పడి మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఓ బాలిక కోసం ఓ వ్యక్తి ఒళ్లు గగుర్పొడిచే సాహసమే చేశాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి, రైలుకు ఎదురెళ్లి మరీ బాలికను రక్షించాడు. రెప్పపాటు సమయంలో చాకచక్యాన్ని ప్రదర్శించిన అతడికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లోని బర్ఖేడీ ప్రాంతంతో జరిగిన ఈ సంఘటన.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన మహమ్మద్‌ మెహబూబ్ ఓ ఫ్యాక్టరీలో వడ్రంగిగా పనిచేస్తున్నాడు. అతడు పనికి వెళ్లే దారిలో రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. ప్రతి రోజులాగే ఆ రోజు విధులకు వెళ్తుండగా.. గూడ్స్ రైలు వస్తుండటంతో మెహబూబ్‌తో పాటు మరికొంతమంది ఆగిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో అక్కడ తల్లిదండ్రులతో నిల్చున్న ఓ బాలిక అకస్మాత్తుగా పట్టాలపై పడిపోయింది. అప్పటికే గూడ్స్ రైలు దూసుకొస్తోంది.

అయితే, అక్కడే ఉన్న మెహబూబ్ వెంటనే పట్టాలపై దూకి, ఆమెను వాటి మధ్యలోని ట్రాక్‌ బెడ్‌ పైకి లాగేశాడు. అంతేగాకుండా రైలు కింది భాగానికి తగలకుండా ఆమె తలను కిందికి వంచేశాడు. తర్వాత వారిపై నుంచి రైలు వెళ్లిపోగా.. ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. తన ప్రాణాలు లెక్కచేయకుండా, మెహబూబ్‌ వీరోచితంగా స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. టీనేజ్‌లో ఉన్న ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడేందుకు పట్టాలపై పడినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని