Manipur Violence: శాంతిని నెలకొల్పేందుకే కఠినంగా వ్యవహరించాం.. అస్సాం రైఫిల్స్‌ వ్యవహారంపై ఆర్మీ ప్రకటన

మణిపుర్‌లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా అస్సాం రైఫిల్స్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కొన్ని ఉద్దేశపూర్వక చర్యలు జరుగుతున్నాయని భారత సైన్యంలోని స్పియర్‌ కార్ప్స్ (Indian Army Spear Corps) పేర్కొంది. 

Updated : 09 Aug 2023 12:22 IST

ఇంఫాల్‌: మణిపుర్‌ (Manipur)లో అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles)పై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడంపై భారత సైన్యంలోని స్పియర్‌ కార్ప్స్ (Indian Army Spear Corps) స్పందించింది. ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో హింసాత్మక ఘటనలను అరికట్టే చర్యలను సమర్థవంతంగా కొనసాగిస్తామని తెలిపింది. కేంద్ర బలగాలు, ముఖ్యంగా అస్సాం రైఫిల్స్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కొన్ని ఉద్దేశపూర్వక చర్యలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు స్పియర్‌ కార్ప్స్‌ ట్విటర్‌లో ప్రకటన చేసింది.

‘‘మే 3 నుంచి మణిపుర్‌లో జరుగుతున్న ఆందోళనల్లో ప్రజలకు భద్రత కల్పిస్తూ.. శాంతిని నెలకొల్పేందుకు శ్రమిస్తున్న అస్సాం రైఫిల్స్‌ సమగ్రతను ప్రశ్నార్థకం చేసేందుకు విఫల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కల్లోలిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పే క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రత బలగాల మధ్య విభేదాలు వస్తుంటాయి. అయితే, వాటిని ఉమ్మడి కార్యాచరణ ద్వారా పరిష్కరిస్తున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు బఫర్‌ జోన్‌ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలన్న హెడ్‌క్వార్టర్స్‌ ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే అస్సాం రైఫిల్స్‌  వ్యవహరించింది. మణిపుర్‌లో హింసాత్మక చర్యలను అడ్డుకునేందుకు భారత సైన్యం, అస్సాం రైఫిల్స్‌ నిరంతరం కృషి చేస్తాయి’’ అని స్పియర్‌ కార్ప్స్‌ పేర్కొంది. 

మీరు కూర్చోండి.. లేకపోతే..!: సహచర ఎంపీపై సహనం కోల్పోయిన కేంద్రమంత్రి

మణిపుర్‌లో కల్లోలిత ప్రాంతం నుంచి అస్సాం రైఫిల్స్‌ను ఉపసంహరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటికే మణిపుర్‌ పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. సాయుధ దుండగులను వెంబడించకుండా అస్సాం రైఫిల్స్‌ సిబ్బంది తమను అడ్డుకున్నారని మణిపుర్‌ పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. అస్సాం రైఫిల్స్‌ ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని మైతేయ్‌ వర్గం మహిళలు సోమవారం ఆందోళన చేపట్టారు. దాంతో కల్లోలిత ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్‌ స్థానంలో సివిల్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాల నియామకం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు