R value: మళ్లీ గుబులురేపుతోన్న ‘ఆర్‌ వాల్యూ’.. నాలుగో వేవ్‌కు సంకేతమా?

కరోనా కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడెక్టివ్‌ వాల్యూ(ఆర్‌ వాల్యూ) మరోసారి భారత్‌ను భయపెడుతోంది. మూడు నెలల్లో మొదటిసారి ఆర్‌ వాల్యూ 1 దాటింది.......

Published : 21 Apr 2022 01:57 IST

దిల్లీ: కరోనా కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడెక్టివ్‌ వాల్యూ(ఆర్‌ వాల్యూ) మరోసారి భారత్‌ను భయపెడుతోంది. మూడు నెలల్లో మొదటిసారి ఆర్‌ వాల్యూ ఒకటి దాటింది. ఇది ఒకటి దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్లే. కొద్ది వారాలుగా దేశంలో ఆర్‌ ఫ్యాక్టర్‌ క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు చెన్నైకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్స్‌ వెల్లడించింది. ఏప్రిల్‌ 5-11 మధ్య 0.93గా ఉన్న ఈ వాల్యూ, ఈ నెల 12-18 నాటికి 1.07 చేరినట్లు శాస్త్రవేత్త సితాభ్ర సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో నాలుగో వేవ్‌ రాబోతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి సితాభ్ర సిన్హా ఆర్‌ ఫ్యాక్టర్‌ను లెక్కగడుతున్నారు. ప్రస్తుతం ఈ వాల్యూ పెరుగుదలకు దిల్లీలో కేసుల విజృంభణతోపాటు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటకలో పెరుగుతున్న కేసులు కారణంగా తెలిపారు. దిల్లీ, యూపీలో ఆర్‌ వాల్యూ ప్రస్తుతం 2గా ఉంది. ప్రధాన నగరాలైన ముంబయి, బెంగళూరు, చెన్నైలోనూ 1 దాటింది. మరికొన్ని నగరాల పూర్తి సమాచారం అందుబాటులో లేదు.
కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ పెరుగుదలను ఆర్‌-ఫ్యాక్టర్‌ ద్వారా అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 1గా ఉంటే ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తి నుంచి (సరాసరి) మరొకరికి సోకుతున్నట్లు పరిగణిస్తారు. 1 కంటే తక్కువగా ఉంటే మాత్రం వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు భావిస్తారు.

దేశంలో మరోసారి రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 4.21 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,067 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దిల్లీ(632), కేరళ(488) ప్రభావమే కొత్త కేసులపై ఎక్కువగా కనిపిస్తోంది. ముంబయిలో మార్చి 2 తర్వాత అత్యధిక కేసులు(85) నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, మహారాష్ట్ర, మిజోరం వంటి రాష్ట్రాలు కొవిడ్ కట్టడి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మంగళవారం కేంద్రం సూచించింది. అలాగే గణాంకాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని కేరళ ప్రభుత్వానికి వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని