భర్త.. భార్యను కొట్టడం కరెక్టేనా..? భారత మహిళల సమాధానమేంటంటే..?

‘సర్దుకుపోవాలమ్మా!’.. పెళ్లయిన కూతురికి ప్రతి తల్లిదండ్రులు చెప్పే మాట ఇది. అవును.. నేటి తరం ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నప్పటికీ అత్తింట్లో

Updated : 27 Nov 2021 13:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సర్దుకుపోవాలమ్మా!’.. పెళ్లయిన కూతురికి ప్రతి తల్లిదండ్రులు చెప్పే మాట ఇది. అవును.. నేటి తరం ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నప్పటికీ అత్తింట్లో మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సర్దుకుపోవాల్సిందే. అయితే గృహహింస విషయంలోనూ మహిళలు సర్దుకుపోయే ధోరణిలోనే ఆలోచిస్తుండటం బాధాకరం. భార్యను కొట్టడం తమ హక్కు అని భర్తలు భావిస్తుంటే.. మహిళలు కూడా అదే నిజమని నమ్ముతుండటం గమనార్హం. తాజాగా నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ అండ్‌ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)-5లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది.

‘‘మీ ఉద్దేశంలో భర్త.. భార్యను కొట్టడం కరెక్టేనా..? అందుకు ఆయన్ను సమర్థించొచ్చా?’’ అని 18 రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లో ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వే నిర్వహించగా.. మెజార్టీ మహిళలు కరెక్టే అని చెప్పారట. అత్యధికంగా తెలంగాణలో 83.8శాతం మంది మహిళలు దీన్ని ఒప్పుకొన్నట్లు సర్వే తెలిపింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 83.6శాతం, కర్ణాటకలో 76.9శాతం, మణిపూర్‌లో 65.9శాతం, కేరళలో 52.4శాతం మంది మహిళలు.. భర్తలు కొట్టడంలో తప్పులేదని చెప్పారు. హిమాచల్‌లో మాత్రం కేవలం 14.8శాతం మహిళలే దీన్ని అంగీకరించినట్లు సర్వే వెల్లడించింది. ఇక భార్యలపై ఈ ప్రవర్తనను(కొట్టడం, దాడి చేయడం) సమర్థించుకుంటున్నారా? అని పురుషులను అడగ్గా.. అత్యధికంగా కర్ణాటకలో 81.9శాతం మంది అవునని చెప్పారు.

‘‘భర్తకు చెప్పకుండా భార్య బయటకు వెళ్లడం.. కుటుంబాన్ని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం.. భర్తతో గొడవపడటం.. శృంగారానికి నిరాకరించడం.. వంట సరిగా చేయకపోవడం, అత్తామామలకు గౌరవం ఇవ్వట్లేద’’నే కారణాలతో భర్త తమను కొడుతున్నారని మెజార్టీ మహిళలు సర్వేలో చెప్పారు. ఇందులో ప్రధానంగా అత్తామామలకు గౌరవం ఇవ్వట్లేదనే కారణంతోనే ఎక్కువ మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని సర్వే పేర్కొంది.

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ ఐదో ఎడిషన్‌ సర్వేను 2019-21 మధ్య నిర్వహించారు. ఆ వివరాలను రెండు విడతలుగా విడుదల చేశారు. తొలివిడత గణాంకాలను గతేడాది డిసెంబరులో బయటపెట్టగా.. రెండో విడత వివరాలను ఇటీవల వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం దేశంలో సంతాన సాఫల్యతా రేటు 2కు పడిపోయిందని తేలింది. ఇక బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ల వినియోగంలో మహిళల సంఖ్య పెరిగిందని సర్వే వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని