
Mehbooba Mufti: ‘ఉగ్ర దాడులపై ముందస్తు సమాచారం ఉన్నా.. విస్మరించారు’
శ్రీనగర్: ఇటీవల కశ్మీర్‌లో జరిగిన వరుస ఉగ్ర దాడుల్లో పలువురు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూ- కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో మైనారిటీలపై దాడుల గురించి అధికార యంత్రాంగానికి ముందస్తు సమాచారం ఉన్నా.. విస్మరించినట్లు మంగళవారం ట్విటర్ వేదికగా ఆరోపించారు. బదులుగా.. కశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొందనే తప్పుడు ప్రచారం చేసేందుకు వస్తున్న కేంద్ర మంత్రులకు భద్రత కల్పించడంలో నిమగ్నమై ఉందని విమర్శించారు. పౌరుల హత్యలకు బాధ్యత తీసుకోకపోవడం, పైగా కశ్మీర్‌వ్యాప్తంగా 700 మంది పౌరులను అరెస్ట్ చేయడం చూస్తుంటే.. తప్పించుకునే ధోరణి కనిపిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం.. తన విధానాలతో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి మొత్తం జనాభాకు శిక్ష విధించడం, అవమానించడం ఏకైక చర్యగా మారిందన్నారు.
ముమ్మరంగా ముష్కరుల ఏరివేత..
కశ్మీర్ లోయలో వరుస ఉగ్ర దాడుల నేపథ్యంలో భద్రతాదళాలు తనిఖీలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కశ్మీర్‌వ్యాప్తంగా దాదాపు 700 మంది ఉగ్ర సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. మరోవైపు ముష్కర మూకలనూ ఏరివేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం షోపియాన్ జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం బందిపొరా, అనంత్‌నాగ్‌లో నిర్వహించిన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.