భూమికి చేరిన గ్రహశకల నమూనాలు

సుదూరంలో ఉన్న ఓ గ్రహశకలానికి సంబంధించిన నమూనాలు ఆదివారం వేకువజామున భూమికి చేరుకున్నాయి. వీటిని తీసుకొచ్చిన జపాన్‌ వ్యోమనౌక హయబుసా-2 విజయవంతంగా ఆ నమూనాలతో కూడిన క్యాప్స్యూల్‌ను భూ వాతావరణంలోకి జారవిడవగా........

Published : 06 Dec 2020 11:27 IST

టోక్యో: సుదూరంలో ఉన్న ఓ గ్రహశకలానికి సంబంధించిన నమూనాలు ఆదివారం వేకువజామున భూమికి చేరుకున్నాయి. వీటిని తీసుకొచ్చిన జపాన్‌ వ్యోమనౌక హయబుసా-2 విజయవంతంగా ఆ నమూనాలతో కూడిన క్యాప్స్యూల్‌ను భూ వాతావరణంలోకి జారవిడవగా.. అది సురక్షితంగా భూమికి చేరింది. దక్షిణ ఆస్ట్రేలియాలోని వూమెరాలో.. పెద్దగా జనావాసాలు లేని మారుమూల ప్రాంతంలో ఇది ల్యాండ్‌ అయింది. దాన్ని శాస్త్రవేత్తలు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నట్లు ‘జపాన్‌ ఏరోస్సేస్‌ ఏజెన్సీ’ వెల్లడించింది. 

ఆదివారం క్యాప్సూల్‌ భూవాతావరణంలోకి ప్రవేశించగానే ఊహించినట్లుగానే అది అగ్నిగోళంగా మారింది. అనంతరం పారాచూట్‌లు విచ్చుకొని వేగం నియంత్రణలోకి వచ్చి సేఫ్‌ ల్యాండిగ్‌ జరిగిందని హయబుసా-2 ప్రాజెక్ట్‌ మేనేజర్‌ యూషీ సుడా వెల్లడించారు. భూమికి చేరుకున్న రెండు గంటల్లో అది ఎక్కడ ల్యాండ్‌ అయిందో గుర్తించామని తెలిపారు. అందుకోసం హెలికాప్టర్‌ సాయంతో గాలింపు చేపట్టామన్నారు. క్యాప్స్యూల్‌ను నిర్దిష్టంగా గుర్తించడానికి ఆ ప్రాంతంలో అనేక శాటిలైట్‌ యాంటెన్నాలు, రాడార్లను జపాన్‌ ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియాలోని ప్రయోగశాలలో పూర్తి స్థాయి సమీక్ష తర్వాత క్యాప్సూల్‌ను తిరిగి జపాన్‌ తీసుకెళ్తామని తెలిపారు. 

ఈ గ్రహశకల నమూనాలను పరిశోధించడం ద్వారా సౌర కుటుంబం, భూమి పుట్టుక గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమికి 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగా.. క్యాప్స్యూల్‌ను హయబుసా-2 విడిచిపెట్టింది. ఇది చాలా సంక్లిష్ట ప్రక్రియ. ఇందుకు అత్యంత కచ్చితమైన నియంత్రణ చర్యలు అవసరం. వ్యోమనౌక నుంచి  విడిపోతున్న దృశ్యాలను వీక్షించడానికి టోక్యోలోని డోమ్‌ స్టేడియం సహా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.

క్యాప్స్యూల్‌ వెడల్పు 40 సెంటీమీటర్లే. భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే గ్రహశకలం నుంచి ఏడాది కిందట ఈ నమూనాలను హయబుసా-2 సేకరించింది. తాజాగా క్యాప్స్యూల్‌ను జారవిడిచిన హయబుసా-2.. 1998కేవై26 అనే గ్రహశకలం దిశగా పయనాన్ని ఆరంభించింది. అక్కడికి చేరుకోవడానికి పదేళ్లు పడుతుంది. ఉల్కలు భూమిని ఢీకొట్టే విధానాలపై పరిశోధన సాగిస్తుంది. ఇటీవలే అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన ‘ఒసైరిస్‌ రెక్స్‌’ వ్యోమనౌక బెన్ను అనే గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి..
బెన్నుపై నాసా కన్ను!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని