Lakhimpur Kheri: లఖింపుర్‌ ఖేరీ ఘటన.. ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌, కానీ..

లఖింపుర్‌ ఖేరీ (Lakhimpur Kheri) ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది.

Published : 25 Jan 2023 12:11 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరీ (Lakhimpur Kheri) ఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్రమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా (Ajay Kumar Mishra) కుమారుడు ఆశిష్‌ మిశ్రా (Ashish Mishra)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అతడికి సర్వోన్నత న్యాయస్థానం 8 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో పాటు కొన్ని షరతులు కూడా విధించింది.

బెయిల్‌ సమయంలో ఆశిష్‌.. ఉత్తరప్రదేశ్ (‌Uttar Pradesh), దిల్లీ (Delhi)లో ఉండకూడదని ధర్మాసనం వెల్లడించింది. కేవలం ట్రయల్‌ కోర్టు విచారణ సమయంలో మాత్రమే యూపీలో అడుగుపెట్టేందుకు కోర్టు అనుమతినిచ్చింది. బెయిల్‌ తర్వాత ఆశిష్‌ తన కొత్త అడ్రసును కోర్టుకు తెలియజేయాలని, పాస్‌పోర్టును కూడా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆశిష్‌ గానీ, అతడి కుటుంబం గానీ సాక్ష్యులను బెదిరించే ప్రయత్నం చేసినట్లు తెలిస్తే అతడి బెయిల్‌ను రద్దు చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి విచారణ తర్వాత ట్రయల్‌ కోర్టు ఆ వివరాలను సుప్రీంకోర్టు (Supreme Court)కు అందజేయాలని సూచిస్తూ.. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది.

2021 అక్టోబర్‌ 3న ఉత్తరప్రదేశ్‌ లఖింపుర్ ఖేరీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపైకి ఆశిష్‌ వాహనం దూసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. అనంతరం జరిగిన హింసాత్మక అల్లర్లలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆశిష్‌ మిశ్రాను ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో ఆశిష్‌కు గతేడాది బెయిల్‌ మంజూరవ్వగా.. కొద్ది రోజులకు అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ దాన్ని రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. నేడు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని