Rains: ‘మహా’ విషాదం.. ఇంకా దొరకని 100మంది ఆచూకీ!

మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పెను విషాదం నింపాయి. కొండచరియలు విరిగిపడటం, అతి భారీ వర్షాలతో సంభవించిన వరదలు తీవ్ర ప్రాణనష్టాన్ని మిగిల్చాయి....

Published : 26 Jul 2021 18:55 IST

164కి చేరిన మృతుల సంఖ్య

ముంబయి: మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పెను విషాదం నింపాయి. కొండచరియలు విరిగిపడటం, అతి భారీ వర్షాలతో సంభవించిన వరదలు తీవ్ర ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. రాయగఢ్‌, వార్ధా, అకోలాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో సోమవారం మరో 11 మృతదేహాలను వెలికితీశారు. వర్షాల కారణంగా చోటుచేసుకున్న దుర్ఘటనల్లో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 164కి పెరిగింది. ఇంకా 100మంది ఆచూకీ లభ్యంకాలేదని అధికారులు వెల్లడించారు.  వరద ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 2,29,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. రాయగడ్‌ జిల్లాలో అత్యధికంగా 71మంది మృతిచెందగా.. సతారాలో 41మంది, రత్నగిరిలో 21మంది, ఠానేలో 12మంది, కొల్హాపుర్‌ 7, ముంబయి 4, సింధుదుర్గ్‌, పుణె, వార్ధా, అకోలాలో ఇద్దరేసి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 

అలాగే, వర్ష బీభత్సంతో చోటుచేసుకున్న ఘటనల్లో 56మంది గాయపడగా.. 100 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాయగఢ్‌లో 53మంది గల్లంతవ్వగా.. సతారాలో 27మంది, రత్నగిరి 14, ఠానే 4, సింధుదుర్గ్‌, కొల్హపుర్‌లో ఒక్కొక్కరు చొప్పున గల్లంతయ్యారు. గాయపడిన వారిలో  రాయగఢ్‌లో ఏడుగురు, ముంబయి, రత్నగిరిలలో ఏడుగురేసి చొప్పున, ఠానేలో ఆరుగురు, సింధుదుర్గ్‌లో ఇద్దరు ఉన్నారు.  మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ సోమవారం పర్యటించారు. సంగ్లి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బోటులో ప్రయాణించి బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని