
Putin: మోదీ, జిన్‌పింగ్ బాధ్యత గల నేతలు
భారత్-చైనా సమస్యను వారే పరిష్కరించుకోగలరని పుతిన్ కితాబు
సెయింట్ పీటర్స్‌బర్గ్: భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇద్దరూ బాధ్యతాయుతమైన నాయకులని, ఆ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం వారికి ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అన్నారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో జరిపిన వర్చువల్ ఇంటరాక్షన్‌లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత్, చైనా సంబంధాలకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తినట్లు తెలుసు. అయితే పొరుగు దేశాల మధ్య ఇలాంటి విభేదాలు తరచూ వస్తుంటాయి. ఇక, నాకు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడి సామర్థ్యం కూడా తెలుసు. వారు చాలా బాధ్యతాయుతమైన నేతలు. వారు పరస్పరం చాలా గౌరవంగా వ్యవహరిస్తారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఇద్దరూ పరిష్కరించుకోగలరు. ఇందులో ఇతర ప్రాంతీయ శక్తుల జోక్యం ఉండకూడదు’’ అని పుతిన్ అన్నారు. ఇటీవల అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్ దేశాలుగా ఏర్పడటం, ప్రాంతీయంగా గ్రూపింగ్ కావడం గురించి మాస్కో అభిప్రాయం ఏంటని పీటీఐ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యాకు భారత్‌తో, చైనాతో గల సంబంధాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని పుతిన్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే రష్యా-చైనా మధ్య పెరుగుతున్న సామీప్యత.. ఇండో-రష్యా భద్రత, రక్షణ సహకారంపై ప్రభావం చూపిస్తుందా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ జరగదన్నారు. భారత్‌తో తమకున్న రక్షణ సంబంధాలు పూర్తిగా నమ్మకంపైనే ఆధారపడి ఉన్నాయని, రక్షణ రంగంలో తమకున్న ఏకైక భాగస్వామి కూడా భారతే అని పుతిన్ చెప్పుకొచ్చారు.
ఇటీవల అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్ దేశాలుగా ఏర్పడి, మూకుమ్మడిగా చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్నాయి. అయితే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకే ఈ దేశాలు గ్రూప్ కట్టాయని డ్రాగన్ ఆరోపిస్తోంది. మరోవైపు రష్యా కూడా క్వాడ్‌పై పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరితో స్నేహం పెంచుకుని భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోకూడదని పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.