Jaipur: రామమందిర నమూనా.. మసాలా చాయ్‌.. మోదీ- మెక్రాన్‌ల మెగా రోడ్‌ షో

‘పింక్‌ సిటీ’ జైపుర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌లు కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు.

Published : 26 Jan 2024 01:29 IST

జైపుర్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron)లు కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. రాజస్థాన్‌ రాజధాని, చారిత్రక ‘పింక్‌ సిటీ’ జైపుర్‌ దీనికి వేదికైంది. ఇరువైపులా భారీ జనసందోహం, భద్రత నడుమ.. జంతర్‌ మంతర్‌ (Jantar Mantar) నుంచి సంగనేరి వరకు ఈ రోడ్‌ షో కొనసాగింది. ఓపెన్‌టాప్‌ వాహనంలో ఇరునేతలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

మార్గం మధ్యలో హవామహల్‌ వద్ద హస్త కళాకృతుల దుకాణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మెక్రాన్‌కు అయోధ్య రామమందిర నమూనాను బహూకరించినట్లు తెలుస్తోంది. యూపీఐ ద్వారా దానికి రూ.500 చెల్లించారని సంబంధిత దుకాణదారు చెప్పినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. అనంతరం ఇద్దరు కలిసి జైపుర్‌ ప్రత్యేక ‘మసాలా చాయ్‌’ రుచి చూశారు. రోడ్‌షో అనంతరం రామ్‌బాగ్‌ ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఇక్కడే ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. మెక్రాన్ కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

గణతంత్ర కవాతుకు భారీ బందోబస్తు

గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ గురువారం మధ్యాహ్నం జైపుర్‌కు చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తదితరులు స్వాగతం పలికారు. మెక్రాన్‌ తొలుత ఆమెర్‌ కోటను సందర్శించారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి యునెస్కో వారసత్వ సంపద జాబితాలోని జంతర్‌ మంతర్‌ విశేషాలు తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని