Weather: కేరళను తాకని నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు భారత్‌కు వచ్చేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. నైరుతి రాకకు మరో రెండు రోజుల సమయం పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

Updated : 01 Jun 2021 15:54 IST

మరో రెండురోజులు ఆలస్యం

దిల్లీ: నైరుతి రుతుపవనాలు భారత్‌కు వచ్చేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. నైరుతి రాకకు మరో రెండు రోజుల సమయం పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నిజానికి రుతుపవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకాల్సి  ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున జూన్‌ 3న భారత్‌లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాల వల్ల భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

భారత్‌పై నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాల సగటు వర్షపాతం (ఎల్‌పీఏ)లో 101 శాతం  జూన్‌-సెప్టెంబరు మధ్యనే  నమోదవుతుంది. గడచిన పదేళ్లలో నమోదైన సగటు వర్షపాతం ఆధారంగా ఎల్‌పీఏను లెక్కిస్తారు. దీర్ఘకాల సగటు వర్షపాతంలో 96  నుంచి 104 శాతం మధ్య నమోదైతే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఎల్‌పీఏలో 98 శాతం వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ గతంలో అంచనా వేసింది. అయితే రుతుపవనాల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతుండటంతో మరో మూడు శాతం పెరగొచ్చని తాజాగా తెలిపింది.

ఉత్తర, దక్షిణ భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మధ్య భారతంలో సాధారణం కంటే  ఎక్కువగా, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.  భారతదేశంలో దాదాపు సగం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు వర్షాధారమైనవే. ప్రధానంగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి రైతులు పంటలు పండిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని