Morbi: గుజరాత్‌ వంతెన దుర్ఘటన.. సీనియర్‌ అధికారిపై వేటు!

గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన కూలిన ఘటనలో తొలిసారి ఓ ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. మోర్బీ మున్సిపల్‌ విభాగం చీఫ్‌ ఆఫీసర్‌(సీవో)ను గుజరాత్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Published : 05 Nov 2022 01:43 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన కూలిన (Cable Bridge Collapse) ఘటనలో తొలిసారి ఓ ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. మోర్బీ(Morbi) మున్సిపల్‌ విభాగం చీఫ్‌ ఆఫీసర్‌(సీవో)ను గుజరాత్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మోర్బీ మున్సిపాలిటీ ముఖ్య అధికారి సందీప్‌సిన్హ్ జాలాను రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ జీటీ పాండ్య వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రెసిడెంట్ అదనపు కలెక్టర్‌కు చీఫ్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అంతకుముందు గురువారం ఈ ఘటనపై పోలీసులు జాలాను నాలుగు గంటలకుపైగా విచారించారు.

మోర్బీ మున్సిపాలిటీ.. ఒరెవా సంస్థకు 15ఏళ్లపాటు ఈ వంతెన మరమ్మతులు, నిర్వహణ కాంట్రాక్టును ఇచ్చినట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే.. ఈ కేబుల్‌ వంతెనను పునః ప్రారంభించే ముందు అధికారులకు సమాచారం అందించలేదని జాలా చెప్పారు. బ్రిటిష్‌ కాలం నాటి ఈ వంతెనకు మరమ్మతులు నిర్వహించిన తర్వాత సేఫ్టీ సర్టిఫికెట్‌ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది.

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిన దుర్ఘటనలో ఇప్పటివరకు 135 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనాస్థలాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించారు. మరోవైపు.. పోలీసులు ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని