Corona: ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలో 173 మందికి కరోనా..!

విదేశాల నుంచి భారత్‌కు వస్తోన్న విమానాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటం కలకలం రేపుతోంది. నిన్న ఇటలీ నుంచి పంజాబ్‌

Published : 07 Jan 2022 18:10 IST

అమృత్‌సర్‌: విదేశాల నుంచి భారత్‌కు వస్తోన్న విమానాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటం కలకలం రేపుతోంది. నిన్న ఇటలీ నుంచి పంజాబ్‌ వచ్చిన ఓ విమానంలో 125 మందికి వైరస్‌ సోకినట్లు తేలిన విషయం తెలిసిందే. తాజాగా అదే దేశం నుంచి వచ్చిన మరో విమానంలోనూ 173 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

ఇటలీలోని రోమ్‌ నుంచి ఓ విమానం శుక్రవారం మధ్యాహ్నం అమృత్‌సర్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అందులో 290 మంది ప్రయాణికులున్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం.. వీరికి ఎయిర్‌పోర్టులో కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 173 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో బాధితులను ఐసోలేషన్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

నిన్న ఇటలీలోని మిలాన్‌ నుంచి ఇదే విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానంలో 125 మందికి కరోనా సోకినట్లు తేలింది. ‘ముప్పు ఉన్న’ దేశాల్లో ఒకటిగా ఇటలీని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించిన నేపథ్యంలో నిబంధనల మేరకు ప్రయాణికులకు పరీక్షలు జరపగా.. పెద్ద ఎత్తున కేసులు బయటపడ్డాయి. వీరికి అమృత్‌సర్‌లోని పలు ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. అయితే అధికారుల కళ్లుగప్పి ఇందులో 13 మంది ప్రయాణికులకు ఐసోలేషన్‌ నుంచి తప్పించుకుని పారిపోయారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. విదేశీ ప్రయాణికులకు కేంద్రం తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చినప్పటికీ తప్పనిసరిగా ఏడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని కేంద్ర హోంశాఖ నేడు ఆదేశించింది. ఎనిమిదో రోజు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకుని ఆ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని