Israel: ఇజ్రాయెల్‌ నూతన ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్‌

ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు 12 ఏళ్ల పాలన ముగిసింది. ఇజ్రాయెల్‌ పార్లమెంట్ నెసెట్‌ ఆదివారం సమావేశమై కొత్త ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్‌ను ఎన్నుకుంది. 120 మంది సభ్యులు గల నెసెట్‌లో సైద్ధాంతికంగా భిన్న పార్టీలతో కూడిన కూటమికి అనుకూలంగా 60

Updated : 14 Jun 2021 06:57 IST

జెరుసలెం: ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు 12 ఏళ్ల పాలన ముగిసింది. ఇజ్రాయెల్‌ పార్లమెంట్ నెసెట్‌ ఆదివారం సమావేశమై కొత్త ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్‌ను ఎన్నుకుంది. 120 మంది సభ్యులు గల నెసెట్‌లో సైద్ధాంతికంగా భిన్న పార్టీలతో కూడిన కూటమికి అనుకూలంగా 60 మంది, వ్యతిరేకంగా 59 మంది ఓటు వేశారు. దీంతో నెతన్యాహు ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రధానిగా నియమితులైన నఫ్తాలీ బెన్నెట్‌ మరో రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో 8 పార్టీలు ఉన్నాయి. వీటిలో ఓ అరబ్‌ పార్టీ కూడా ఉంది. ఇజ్రాయెల్‌ చరిత్రలో మొదటిసారిగా ఓ అరబ్‌ పార్టీ ప్రభుత్వంలో చేరడం గమనార్హం. 

120 మంది సభ్యులుగా పార్లమెంట్‌ నెస్సెట్‌కు గత రెండేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో ఏ పార్టీకి తగినంత మెజారిటీ రాకపోవడంతో బెంజమిన్‌ నెతన్యాహు సారథ్యంలోని లిక్‌డ్‌ పార్టీ మరోపార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని పదవిని ఇరు పార్టీలు పంచుకోవాలని అప్పుడు నిర్ణయించుకున్నారు.  

మిలియనీర్‌గా..

ఇజ్రాయెల్‌కు నూతన ప్రధానిగా నియమితులైన 49 ఏళ్ల నఫ్తాలీ బెన్నెట్‌ దేశంలో ప్రముఖ మిలియనీర్‌గా పేరు పొందారు. బెన్నెట్‌ తల్లిదండ్రులు అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు వలస వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు బెన్నెట్‌ ఓ టెక్‌ కంపెనీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు గడించించారు. మతపరమైన జాతీయవాదిగా రాజకీయాల్లో తనపై ముద్ర ఉంది. 2013లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వంలో బెన్నెట్‌ రక్షణ, విద్య, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు.

ప్రధానిగా సదీర్ఘకాలంగా..
ఇక ఇజ్రాయెల్‌కకు నెతన్యాహు 12 ఏళ్ల నుంచి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. 1996-99 మధ్య తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ తర్వాత 2009లో రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఈ పదవిలో కొనసాగారు. 

కొత్త ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు అభినందనలు..

ఇజ్రాయెల్‌ నూతన ప్రధానిగా నియమితులైన బెన్నెట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభినందనలు తెలిపారు. భద్రత, స్థిరత్వం, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి బెన్నెట్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు అమెరికాను మించిన గొప్ప మిత్రుడు లేడని బైడెన్‌ అన్నారు. దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య మంచి బంధం ఉందని, దీన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని