టీకా వేయించుకున్న నటాషా పూనావాలా

‘టీకా తీసుకోవడం గర్వంగా ఉంది’ అంటున్నారు నటాషా పూనావాలా. ఆమె సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా సతీమణి.

Updated : 02 Mar 2021 19:15 IST

దిల్లీ: ‘టీకా తీసుకోవడం గర్వంగా ఉంది’ అంటున్నారు నటాషా పూనావాలా. ఆమె సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా సతీమణి. అంతేకాకుండా ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, తాను నేడు టీకా మొదటి డోసు తీసుకున్న విషయాన్ని ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించారు. 

‘టీకా డోసు తీసుకోవడం గర్వంగా ఉంది. కొవిషీల్డ్‌ టీకాకు అంతర్జాతీయంగా, దేశీయంగా క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించారు. వాటిలో అది సురక్షితమైందని, సమర్థవంతమైందని తేలింది’ అంటూ నటాశ తాను టీకా వేయించుకుంటున్న చిత్రాన్ని షేర్ చేశారు. 

టీకా తీసుకున్న ప్రముఖులు...

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్: రెండో దశ కరోనా టీకా కార్యక్రమం కింద కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ టీకా వేయించుకున్నారు. దిల్లీలోని ఔహార్ట్‌ అండ్ లంగ్‌ ఇనిస్టిట్యూట్‌లో మంత్రి, ఆయన సతీమణి కొవాగ్జిన్ టీకా వేయించుకోవడంతో పాటు..ఇద్దరూ నిర్దేశిత రుసుము(రూ.250)ను ఆసుపత్రికి చెల్లించారు. ‘నేను, నా సతీమణి టీకా తీసుకున్నాం. ఇప్పటివరకు మాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ కనిపించలేదు. 60 ఏళ్లు దాటిన, 45ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ టీకాలు మనందరికి సంజీవనిలా పనిచేస్తాయి’ అని వెల్లడించారు. 

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: ఆర్‌ఆర్ ఆసుపత్రిలో ఈ రోజు కరోనా టీకా మొదటిడోసును స్వీకరించినట్లు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ‘ఈ టీకా డ్రైవ్ ద్వారా భారత్‌ను కొవిడ్ రహితంగా మార్చాలనే సంకల్పం మరింత బలపడింది. ఈ టీకా ఏ ఇబ్బంది లేకుండా, సురక్షితంగా ఉంది’ అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. టీకా అభివృద్ధికి కృషి చేసిన శాస్త్రవేత్తల సేవలను కొనియాడారు .

విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్: తాను కొవాగ్జిన్ టీకా తీసుకున్నట్లు, అంతా బాగానే ఉన్నట్లు వెల్లడించారు. అలాగే టీకా తీసుకుంటున్నప్పటి చిత్రాన్ని ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి: ప్రభుత్వ నిబంధనల ప్రకారం..ఈ రోజు ఉదయం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో టీకా తీసుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. కరోనా కట్టడిలో ముందు నిలిచి, టీకా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు, వైద్యులు, కరోనా వారియర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్: ‘ఈ రోజు పట్నాలోని ఎయిమ్స్‌లో భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కరోనా టీకా తీసుకున్నాను. టీకా కోసం నిర్దేశించిన రుసుమును చెల్లించేందుకు మంత్రులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. బిహార్‌లో టీకాను ఉచితంగా అందిస్తున్నప్పటికీ ..నా వంతుగా రూ.250ని ఆసుపత్రికి చెల్లించాను’ అని ఆయన వెల్లడించారు.

కమల్ హాసన్‌: దక్షిణాదికి చెందిన విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్(66) మంగళవారం కరోనా టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘శ్రీ రామచంద్ర ఆసుపత్రిలో నేను కరోనా టీకా వేయించుకున్నాను. తమ గురించే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించేవారు టీకా వేయించుకోవాలి’ అంటూ ఆయన టీకా ప్రాముఖ్యతను ప్రజలకు వెల్లడించారు.

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా భారత్ కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి జనవరి 16నే మొదటిదశలో టీకాలు అందించే కార్యక్రమం ప్రారంభమైంది. మార్చి ఒకటి నుంచి 60 ఏళ్లు పైబడిన, 45ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల కోసం రెండో దశ మొదలైంది. ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది. పుణె కేంద్రంగా నడిచే సీరం సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీదారనే విషయం తెలిసిందే. పలు దేశాలకు ఈ సంస్థ టీకా సరఫరా చేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని