Parliament: పెగాసస్‌పై ప్రత్యేక చర్చ.. ప్రభుత్వం ఏమందంటే..!

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా పెగాసస్‌ వ్యవహారంపై సభలో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Published : 31 Jan 2022 22:19 IST

పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ప్రహ్లాద్‌ జోషీ స్పష్టత

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా పెగాసస్‌ వ్యవహారంపై సభలో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంతో మరోసారి తీవ్ర దుమారం రేగడంతో.. ఈ వివాదంపై చర్చించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ స్పష్టం చేశారు. అయినప్పటికీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో ఎటువంటి సమస్యనైనా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తవచ్చని పేర్కొన్నారు.

ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత సభ నిర్వహణపై అఖిలపక్ష భేటీ జరిగింది. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఈ సమావేశానికి 25 పార్టీలకు చెందిన ఫ్లోర్‌ లీడర్లు హాజరైనట్లు మంత్రి ప్రహ్లాద్‌ జోషీ వెల్లడించారు. ప్రభుత్వం తరపున రక్షణశాఖ మంత్రి, లోక్‌సభలో ఉపనేత రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని అన్ని పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇక పెగాసస్‌ అంశానికి వస్తే.. ప్రస్తుతం అది న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా ఫిబ్రవరి 12 వరకూ కొనసాగుతాయి. అనంతరం మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 8 వరకు మరో విడతలో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఇదే సమయంలో 2017లో ఇజ్రాయెల్‌తో జరిగిన రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసినట్లు ఇటీవల న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడి కావడంతో ఈ వ్యవహారంపై మరోసారి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని