Congress: ‘ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆ ట్రస్టులపై చర్యలు’

కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోన్న రెండు ట్రస్టులకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద జారీ చేసిన లైసెన్సును కేంద్ర హోంశాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. పాత ఆరోపణలనే కేంద్రం మళ్లీ తోడుతోందని విమర్శించింది.

Published : 24 Oct 2022 01:20 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోన్న రెండు ట్రస్టులకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(FCRA) కింద జారీ చేసిన లైసెన్సును కేంద్ర హోంశాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యలను కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం తీవ్రంగా ఖండించింది. పాత ఆరోపణలనే కేంద్రం మళ్లీ తోడుతోందని విమర్శించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి రోజువారీ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలా చేస్తోందని ఓ ప్రకటనలో ఆరోపించింది. ‘రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌(RGF), రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌(RGCT)లు వాటిపై వచ్చిన ఆరోపణలపై కచ్చితంగా స్పందిస్తాయి. న్యాయపరంగా పోరాడతాయి’ అని పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

‘లాభాపేక్ష లేని ఈ రెండు సంస్థల కార్యకలాపాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయి. అవి గొప్ప ప్రజాసేవను అందించాయి’ అని జైరాం రమేశ్‌ తెలిపారు. ‘భారత్ జోడో యాత్ర’ను కొనసాగించే విషయంలో కాంగ్రెస్‌ను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్‌జీఎఫ్‌, ఆర్‌జీసీటీలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై 2020లో హోంశాఖ ఏర్పాటు చేసిన అంతర్‌మంత్రిత్వ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ విరాళాల దుర్వినియోగం, అక్రమ నగదు చలామణి వంటి నేరాలను ఈ కమిటీ గుర్తించినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ట్రస్టులకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ తప్పనిసరి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని