Narendra Modi: ఏరోజూ ప్రధాని అవుతానని ఊహించలేదు!

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో నేడు మరుపురాని రోజు. రాజ్యాంగ పదవి స్వీకరించి నేటికి సరిగ్గా 20ఏళ్లు పూర్తయ్యాయి. 2001 అక్టోబర్‌ 7వ తేదీన ఆయన తొలిసారి

Published : 07 Oct 2021 14:22 IST

గుజరాత్‌ సీఎం పీఠాన్ని అధిరోహించి నేటితో 20ఏళ్లు
13ఏళ్లు గుజరాత్‌కు, ఏడేళ్లుగా దేశానికి మోదీ సేవలు

దిల్లీ: భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో నేడు మరుపురాని రోజు. రాజ్యాంగ పదవి స్వీకరించి నేటికి సరిగ్గా 20ఏళ్లు పూర్తయ్యాయి. 2001 అక్టోబర్‌ 7వ తేదీన ఆయన తొలిసారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏకధాటిగా 13ఏళ్లు సీఎంగా ఆ రాష్ర్టానికి సేవలందిందించారు. 2014లో ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రూపురేఖలు మారాయి. నేడు ఉత్తరాఖండ్‌లోని ఎయిమ్స్‌ రిషికేశ్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా తన ప్రజాజీవిత విశేషాలను పంచుకున్నారు.  
‘‘ రెండు దశాబ్దాల క్రితం నా ప్రజా జీవన ప్రయాణం ప్రారంభమైంది. కానీ, నా జీవితంలో ఏదో ఒక రోజు ప్రధానమంత్రి అవుతానని మాత్రం ఊహించలేదు. ప్రజల ఆశీర్వాదంతో 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికయ్యా. ఈ రోజు రిషికేష్‌లో నా 21వ సంవత్సరం ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను’’ అన్నారు.

తక్కువ సమయంలోనే నిరూపించాము..
కరోనా వేళ.. మన పనితీరు దేశ సామర్థ్యానికి నిదర్శనం. తక్కువ వ్యవధిలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చాం. ప్రారంభంలో కేవలం ఒకే టెస్టింగ్‌ ల్యాబ్‌ ఉండేది... అలాంటిది ప్రస్తుతం ఆ సంఖ్య 3000 టెస్టింగ్‌ ల్యాబ్స్‌కు పెరిగింది. మాస్కులు, పీపీఈ కిట్స్‌ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి.. వాటిని ఎగుమతి చేసే స్థాయి మనం చేరుకొన్నాము. అంతేకాదు.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎంత భారీ స్థాయిలో జరుగుతుందో చెప్పడానికి నిర్మించిందే కొవిన్‌ ప్లాట్‌ఫామ్‌. అదే ఇప్పుడు యావత్‌ ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించింది.

35 ప్లాంట్లు.. 35 ప్రాంతాలకు..
ఉత్తరాఖండ్‌లోని ఎయిమ్స్‌ రిషికేశ్‌ లో ఆక్సిజన్‌ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ పీఎం కేర్స్‌తో నిర్మించిన 35 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను దేశంలోని 35రాష్ర్టాలు, కేంద్రపరిపాలిత ప్రాంతాలకు అంకితమిచ్చారు. అదేసమయంలో వీటన్నిటినీ ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామీతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని