
Ayushman Bharat: ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ఐడీ
‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
దిల్లీ: భారత వైద్యారోగ్య రంగంలో నూతన అధ్యాయానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ను సోమవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ఐడీ కేటాయిస్తామని ప్రకటించారు. ‘పేద, మధ్యతరగతి ప్రజల వైద్య చికిత్సలకు ఎదురయ్యే సమస్యలను తొలగించడంలో ఈ మిషన్ పెద్ద పాత్ర పోషిస్తుంది. 130 కోట్ల ఆధార్ ఐడీలు, 118 కోట్ల మొబైల్ సబ్‌స్క్రైబర్లు, సుమారు 80 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు, 43 కోట్ల జన్‌ధన్ బ్యాంక్ ఖాతాలు.. ఇంత భారీ అనుసంధాన మౌలిక సదుపాయాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. దేశంలో రేషన్ పంపిణీ నుంచి పరిపాలన వరకూ.. ఇలా ఆయా రంగాల్లో డిజిటల్ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయ’ని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
సమాచారానికి పూర్తి భద్రత..
ఈ మిషన్ ద్వారా దేశ పౌరుల ఆరోగ్య వివరాలు, రికార్డులను డిజిటలీకరణ చేయనున్నారు. ఈ క్రమంలో వారికి వ్యక్తిగత హెల్త్ ఐడీ ఇవ్వనున్నారు. ఈ ఐడీలో వారి ఆరోగ్య సమాచారాన్ని పొందుపర్చి.. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తారు. వైద్యులు, ఆసుపత్రులు, హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ సమాచారం ఆధారంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వ్యక్తుల ఆరోగ్య సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందని తెలిపారు. గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. కార్యక్రమం ప్రారంభానికి ముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ప్రధాని ఈ మిషన్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్య రంగంలో ఇది విప్లవాత్మక మార్పులను తెస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.