Modi speaks with Zelensky: ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ధన్యవాదాలు..!

ఉక్రెయిన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్రమోదీ చర్చించారు.

Updated : 07 Mar 2022 13:53 IST

తాజా పరిణామాలపై చర్చించిన ఇరు దేశాల అధినేతలు

దిల్లీ: ఉక్రెయిన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్రమోదీ చర్చించారు. దాదాపు 35 నిమిషాల పాటు ఫోన్‌ మాట్లాడుకున్న ఇద్దరు దేశాధినేతలు.. ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు అక్కడి ప్రభుత్వం అందిస్తోన్న సహకారం పట్ల దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న చర్చలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మరోవైపు రష్యా అధ్యక్షుడితో రెండుసార్లు చర్చలు జరిపిన మోదీ.. నేడు మరోసారి ఫోన్‌లో మాట్లాడనున్నారు. ఉక్రెయిన్‌-రష్యా మధ్య మూడో విడత శాంతి చర్చలు జరుగనున్న సమయంలో ఇరు దేశాధినేతలతో ప్రధాని మోదీ చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఇప్పటికే రెండుసార్లు మాట్లాడిన మోదీ.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా భారతీయులను తరలించేందుకు వీలుగా ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటించాలని కోరారు. ఇరుదేశాల విషయంలో భారత్‌ తటస్థ వైఖరి అనుసరిస్తోందని స్పష్టం చేసిన మోదీ, అక్కడనుంచి భారతీయులను స్వదేశానికి తరలించడమే తమ తొలి కర్తవ్యంగా చెప్పారు. తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో మాట్లాడిన సందర్భంలోనూ భారతీయుల తరలింపుపైనే ప్రధానంగా చర్చించారు. ఇప్పటి వరకు కొనసాగుతోన్న ఆపరేషన్‌ గంగ కార్యక్రమానికి ఉక్రెయిన్‌ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని, సుమీలో చిక్కుకుపోయిన వారిని తరలించే విషయంలోనూ సహకారం ఇలాగే కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నేటి సాయంత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ మరోసారి మాట్లాడనున్నారు.

ఇదిలాఉంటే, రష్యా-ఉక్రెయిన్‌ విషయంలో తటస్థ వైఖరి అవలంబిస్తోన్న భారత్‌.. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితిలోనూ ఓటింగ్‌కు దూరంగా ఉంటోంది. రష్యాకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పలు తీర్మానాల ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. మరోవైపు ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం ద్వారా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని తీసుకువస్తోన్న భారత్‌.. ఇప్పటి వరకు 16వేల మందిని స్వదేశానికి సురక్షితంగా చేరవేసింది. సోమవారం రోజున మరో 2వేల మంది భారత్‌కు చేరుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని