గర్భిణీ అయినా భయపడలేదు!

ఆడది అబల కాదు.. ఆదిశక్తి అని నిరూపిస్తున్నారు నేటి మహిళలు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బయట అడుగుపెట్టేందుకే ప్రజలు భయంతో వణికిపోతుంటే..ఎంతో ధైర్యంతో మహిళలు తమ వృత్తికి న్యాయం చేస్తున్నారు...

Updated : 24 Apr 2021 17:11 IST

ఆదర్శంగా నిలుస్తున్న మహిళా నర్సు

సూరత్‌: ‘మహిళ అబల కాదు.. ఆదిశక్తి’ అని నిరూపిస్తున్నారు నేటి మహిళలు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బయట అడుగుపెట్టేందుకే ప్రజలు భయంతో వణికిపోతుంటే..ఎంతో ధైర్యంతో మహిళలు తమ వృత్తికి న్యాయం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఛత్తీస్‌గఢ్‌లో ఓ మహిళా పోలీస్‌ అధికారి చూపిన అంకితభావం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఐదు నెలల గర్భవతి అయిన శిల్పా సాహు అనే డీసీపీ రోడ్డు మీద వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.  తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో మహిళా నర్సు గర్భవతి అయినప్పటికీ  ఏమాత్రం భయపడకుండా కొవిడ్‌ బాధితులకు దగ్గరుండి సేవలు అందించడం ఆందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె చూపిన తెగువ అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

అయేజా మిస్త్రీ నాలుగు నెలల గర్భవవతి. సూరత్‌లోని అటల్ కొవిడ్‌-19 సెంటర్‌లో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో, గర్భిణీగా ఉన్న సమయంలో తాను దగ్గరుండి కరోనా బాధితులకు వైద్యసేవలు అందించడం ఎంత ముప్పో ఆమె తెలుసు. కానీ, ఆమె ఏమాత్రం నెరవలేదు. మనోధైర్యంతో రోజుకు 8 గంటలపాటు వైద్యసేవలు అందిస్తోంది. వెళ్లేటప్పుడు వారి ముఖాల్లో చిరునవ్వును చూసి మురిసిపోతోంది. ప్రవిత్ర రంజాన్‌ మాసంలో కొవిడ్‌ బాధితులకు సేవ చేసే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు అయేజా మిస్త్రీ.

‘‘ నా కడుపులో బిడ్డ పెరుగుతోందని నాకు తెలుసు. కానీ, నాకు నా విధులు కూడా  ముఖ్యమే. ఆ దేవుడి దయతో పవిత్ర రంజాన్ మాసంలోనే కరోనా బాధితులకు సేవ చేసే అవకాశం దక్కింది’’ అని ఆమె అంటున్నారు. కరోనా మొదటి దశలోనూ ఆమె అదే కొవిడ్ కేంద్రంలో  విధులు నిర్వర్తించారు. కేవలం వీరిద్దరేకాదు.. ఎంతోమంది మహిళా డాక్టర్లు, పోలీసు అధికారులు కొవిడ్‌ కష్టకాలంలో ఏమాత్రం భయపడకుండా ప్రజలకు సేవలు అందించడంతోపాటు, తమ వృత్తికి న్యాయం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని