Kejriwal: సామాన్యుడికి ఆ రెండే పెద్ద ఛాలెంజ్‌.. ఐదేళ్లలో 20లక్షల కొత్త ఉద్యోగాలే టార్గెట్‌!

వచ్చే ఐదేళ్లలో 20లక్షల కొత్త ఉద్యోగాల కల్పనే ఈరోజు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లక్ష్యమని దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ .....

Published : 26 Mar 2022 15:43 IST

దిల్లీ: వచ్చే ఐదేళ్లలో 20లక్షల కొత్త ఉద్యోగాల కల్పనే ఈరోజు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లక్ష్యమని దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దిల్లీలో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2014-15లో వార్షిక బడ్జెట్‌ రూ.31వేల కోట్ల బడ్జెట్‌ ఉండగా.. ఇప్పుడది రూ.76వేల కోట్లుకు పెరిగిందన్నారు. దిల్లీ బడ్జెట్‌ దాదాపు 2.5 రెట్లు పెరిగినట్టు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ధరల పెరుగుల, నిరుద్యోగం.. ఈ రెండే సామాన్యుడి ముందున్న అతిపెద్ద సవాళ్లు. దిల్లీ బడ్జెట్‌ సాహసోపేతమైనది. వినూత్నమైనది. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. దిల్లీలో 1.68లక్షల మంది ఉపాధికి అర్హులుగా ఉన్నారు. ఉద్యోగ కల్పనకు టూర్‌, ట్రావెల్‌, కన్‌స్ట్రక్షన్‌ వంటి ఎనిమిది రంగాలను గుర్తించాం. దిల్లీ షాపింగ్ ఫెస్టివల్‌ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. దాంతో ఉద్యోగాలు కూడా వస్తాయి. దిల్లీ బజార్‌ పోర్టల్‌ అన్ని దుకాణాలు, మార్కెట్లను కలుపుతోంది.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది’’ అన్నారు. 

‘‘దిల్లీలో 3.75లక్షల మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లకు మార్చారు. దిల్లీ ప్రభుత్వం ప్రజలకు అసమానమైన ఆరోగ్య భరోసా కల్పిస్తోంది. ఉచిత నీటి సరఫరాకు కృషి చేస్తున్నాం. ధరల పెరుగుదల నేపథ్యంలో ఉచిత నీరు, ఉచిత విద్యుత్, ఆరోగ్యం, రవాణా, విద్య కల్పించడం ప్రజల జీవనాన్ని సులభతరం చేస్తాయి. యమునా నదిని ప్రక్షాళన చేస్తాం.. ఆ పని కొనసాగుతోంది. ఇల్లులేని పిల్లల చదువు కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేశాం’’

కశ్మీర్‌ పండింట్లపై భాజపా రాజకీయం
‘‘ఈ 8ఏళ్ల కాలంలో ఒక్క కశ్మీరీ పండిట్‌ కుటుంబాన్ని అయినా భాజపా కశ్మీర్‌కు తరలించిందా? ఈ అంశంపై భాజపా రాజకీయం చేస్తోంది. ‘ద కశ్మీర్‌ఫైల్స్‌’ చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం. దీనిద్వారా వచ్చే డబ్బును కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఏకీకరణ బిల్లును ఎన్నికలను ఆలస్యం చేసేందుకే కేంద్రం తీసుకొచ్చింది. ఈ బిల్లును అధ్యయనం చేస్తాం. అవసరమైతే కోర్టులో ఛాలెంజ్‌ చేస్తాం’’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని