Tamilnadu Rain: తమిళనాడులో మళ్లీ భారీవర్షాలు.. ఎనిమిది మంది మృతి!

భారీ వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నైసహా తూత్తుకుడి, తిరునల్వేలి, విరుద్‌నగర్‌, శివగంగ, దిండిగుల్‌, మధురైలోని ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన ప్రమాదాల్లో దాదాపు...

Updated : 27 Nov 2021 15:19 IST

చెన్నై: భారీ వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నైసహా తూత్తుకుడి, తిరునల్వేలి, విరుద్‌నగర్‌, శివగంగ, దిండిగుల్‌, మధురైలోని ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన ప్రమాదాల్లో దాదాపు ఎనిమిది మంది మృతి చెందినట్లు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్ వెల్లడించారు. వీరిలో ముగ్గురు శుక్రవారం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. వరద బాధితుల కోసం మొత్తం 109 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చింగ్లేపేట, కాంచీపురంలో రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించినట్లు వెల్లడించారు. పుదుచ్చేరిలోనూ శనివారం తెల్లవారుజామున తేలికపాటి జల్లులు కురిశాయి.

ఈ మూడు రోజులు భారీ వర్షసూచన..

కేప్‌ కొమోరిన్ ప్రాంతం, శ్రీలంక తీరం మీదుగా తుపాను ఆవరించి ఉందని, దీంతో తమిళనాడు తీరంలో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. వీటి ప్రభావంతో ఈ మూడు రోజుల్లో తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి సహా పుదుచ్చేరి, కరైకల్‌లోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లోని జాలరులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేసింది. దీంతోపాటు దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం చెన్నైతోసహా ఇక్కడి 21 ఒక్క జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని