ఆసుపత్రి నుంచి 860 రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ చోరీ

విపత్కర కరోనా పరిస్థితుల్లో ప్రాణాధార మందులకున్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే.

Published : 18 Apr 2021 10:52 IST

భోపాల్‌: విపత్కర కరోనా పరిస్థితుల్లో ప్రాణాధార మందులకున్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ ఇటీవల తీవ్ర కొరత ఏర్పడింది. కొందరు స్వార్థపరులు దీనిని అవకాశంగా మలచుకొని నల్లబజారులో అధిక ధరలకు వాటిని విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అందుకోసం అడ్డదారులు తొక్కుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ప్రభుత్వ హమిదియా ఆసుపత్రిలో నిల్వచేసిన 860 రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ కనిపించకుండా పోవడం వెనుక ఇలాంటి వారి హస్తమే ఉన్నట్లు తెలుస్తోంది. వీటి చోరీ ఎలా జరిగింది, ఈ దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారో తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీలో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇండోర్‌ నగరంలో రెమ్‌డెసివిర్‌ను నల్లబజారులో రూ.22వేలకు విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఒకే వ్యక్తి రెండుసార్లు మృతి!

విదిషా: ఎవరికైనా చావు ఒక్కసారే వస్తుందంటారు. మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని ఆసుపత్రి మాత్రం ఒకరోజు వ్యవధిలోనే గొరాలాల్‌ కోరి(58) అనే వ్యక్తి రెండుసార్లు మృతి చెందినట్లు ప్రకటించింది. రైల్వే ఉద్యోగి అయిన గొరాలాల్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 12న ఏబీవీ వైద్య కళాశాలలో చేర్చారు. ఆ మరుసటి రోజు గొరాలాల్‌ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలపడంతో ఆయన కుమారుడు కైలాష్‌ ఆసుపత్రి వద్దకు వచ్చారు. అప్పుడు నర్సు ఎదుటపడి మీ నాన్న ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపింది. 14వ తేదీ ఉదయం మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆసుపత్రి సిబ్బంది అందజేయగా తండ్రి మృత దేహాన్ని చూడాల్సిందేనని కైలాష్‌ సోదరుడు డిమాండ్‌ చేశారు. దీంతో సిబ్బంది వారిని మార్చురీ వద్దకు తీసుకెళ్లగా ఆ మృతదేహం గొరాలాల్‌ది కాదని తెలిసింది. వెంటనే సిబ్బంది మరణ ధ్రువీకరణ పత్రాన్ని వెనక్కి తీసుకున్నారు. వార్డులోకి వెళ్లి చూడగా గొరాలాల్‌ వెంటిలేటర్‌పై ప్రాణాలతో ఉన్నారు. ఇంటికి తిరిగివెళ్లిన ఆ కుటుంబ సభ్యులకు ఆ సాయంత్రమే గొరాలాల్‌ నిజంగానే చనిపోయాడంటూ ఫోన్‌ వచ్చింది. సిబ్బంది తప్పిదం వల్లే గొరాలాల్‌ మృతి విషయంలో గందరగోళం ఏర్పడిందని ఆసుపత్రి డీన్‌ తెలిపారు.

రోగుల ప్రాణాలు తీసిన ఆక్సిజన్‌ కొరత

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. గోమతీ నగర్‌లోని లోహియా ఆస్పత్రిలో శనివారం ఈ ఘటన జరిగింది. గోమతీ నగర్‌లోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో పడకలన్నీ కరోనా రోగులతో నిండిపోవడంతో కొందరికి స్ట్రెచర్‌పైనే వైద్యులు ఆక్సిజన్‌ అమర్చారు. శనివారం ఉదయం 6 గంటలకు ఆసుపత్రి బ్లాక్‌లో ఆక్సిజన్‌ పూర్తిగా అయిపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు కొవిడ్‌ బాధితులు మరణించారు. రాజస్థాన్‌ పాళీలోని బంగర్‌ ఆస్పత్రిలో ఇదే తరహా ఘటన జరగ్గా అక్కడ ఓ మహిళ మృతిచెందారు. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు