ఆపరేషన్‌ తపోవన్‌: ఆరో రోజు అదే ఉత్కంఠ!

ఆకస్మిక వరదల కారణంగా ఉత్తరాఖండ్‌ తపోవన్‌ సొరంగంలో చిక్కుకుపోయిన వారికోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Updated : 12 Feb 2021 16:51 IST

తపోవన్‌: ఆకస్మిక వరదల కారణంగా ఉత్తరాఖండ్‌ తపోవన్‌ సొరంగంలో చిక్కుకుపోయిన వారికోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సొరంగం నుంచి ఇప్పటికే ఇద్దరిని రక్షించగా, మరో 30మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, వీటికి ప్రతికూల వాతావరణం తీవ్ర అడ్డంకిగా మారింది. ఈ దుర్ఘటన జరిగి ఆరు రోజులు అయినప్పటికీ కార్మికుల ఆచూకీ కోసం భారత ఆర్మీతో పాటు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా ముమ్మరం గాలింపు చేపట్టాయి.

అయితే, జోషిమఠ్‌లో దౌలీగంగలో వరద ప్రవాహం మళ్లీ మొదలు కావడంతో అధికారులు వ్యూహాన్ని మార్చారు. కేవలం బురదను తొలగించడమే కాకుండా మరోచోట సొరంగానికి రంధ్రం చేసి ఎలాగైనా లోనికి ఆక్సిజన్‌ పంపించాలని నిర్ణయించిన అధికారులు ఆ కోణంలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తపోవన్‌ విద్యుత్‌కేంద్రం సొరంగంలో చిక్కుకుపోయిన వారి ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్‌ కొనసాగుతోందని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. ఓవైపు పూడికను తొలగించడంతో పాటు మరోవైపు సొరంగ మార్గానికి రంధ్రాలు చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. సంఘటన జరిగి ఆరు రోజులు గడుస్తున్నా విశ్వాసాన్ని కోల్పోలేదని..అందులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చివరివరకూ తమ ప్రయత్నం కొనసాగిస్తామని డీజీపీ స్పష్టంచేశారు. అయితే, సొరంగంలో దాదాపు 180 మీటరు ప్రాంతంలో కార్మికులు చిక్కుకొని ఉంటారని భావిస్తున్న అధికారులు, ప్రస్తుతం 114మీటర్ల మేర మట్టిన తీసి లోపలికి ఆక్సిజన్‌ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

పది మృతదేహాలకు అంత్యక్రియలు..
ఉత్తరాఖండ్‌ దుర్ఘటనలో ఇప్పటి వరకు 36మంది మృతదేహాలను వెలికితీయగా, వీరిలో పదిమందిని గుర్తించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. వీటికి ఇప్పటికే అంత్యక్రియలు నిర్వహించామని, నిబంధనల ప్రకారం మరో 72గంటల తర్వాత మిగిలిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఘటనలో మరో 169 మంది ఆచూకీ  తెలియాల్సి ఉండగా, వీరికోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.

శాస్త్రవేత్తల అధ్యయనం..
హిమాలయ ప్రాంతం నుంచి నదిలోకి ఏ మేరకు నీరు వస్తోందని అంచనా వేసేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం డీఆర్‌డీఓతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన సాంకేతిక బృందం హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించింది. జోషిమఠ్‌లోని రైనీ గ్రామం సమీపంలో ఉన్న సరస్సుపై ఇప్పటికే పూర్తి సమాచారం ఉందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలనే విషయం తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇదిలాఉంటే, సొరంగంలో చిక్కుకుపోయిన కుటుంబాలు మాత్రం తమవారి ఆచూకి కోసం ధీనంగా ఎదురుచూస్తున్నాయి.

ఇవీ చదవండి..
ఆ పరికరంపైనే ‘అణు’మానాలు
జల విలయం: ఆ నిర్లక్ష్యమే కొంపముంచిందా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని