Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్‌ వివాదం.. రాజ్‌నాథ్‌సింగ్‌ ఏమన్నారంటే?

రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి నెయ్యమా.. కయ్యమా అన్నట్లుగా ఉంది. .....

Updated : 10 Aug 2022 11:37 IST

దిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి నెయ్యమా.. కయ్యమా అన్నట్లుగా ఉంది. ఓ వైపు యుద్ధాన్ని నివారించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతుంటే.. మరోవైపు తాజా పరిణామాలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శాంతి కోసమే నిలబడుతుందని నొక్కిచెప్పిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ బల్లియాలోని బాన్షీ బజార్‌లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌ రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల అంశంపై స్పందించారు. తనకు వచ్చిన సమాచారం ప్రకారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారన్నారు. ఈ వివాదంపై అమెరికా అధ్యక్షుడు కొంత చొరవ తీసుకున్నారనీ.. ఏ విధంగానైనా అక్కడ శాంతి పునరుద్ధరణ జరగాలనే భారత్‌ కోరుకుంటుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు జరిగినప్పుడే ఏదో ఒక మార్గం దొరుకుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వ వైఖరి ఏమిటని విలేకర్లు ప్రశ్నించగా.. తాము శాంతి కోరుకుంటున్నామన్నారు. ఎల్లప్పుడూ ప్రపంచ శాంతికే భారత్‌ అనుకూలమని సమాధానమిచ్చారు. మరోవైపు, ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర దేశాలకు గుర్తిస్తూ వ్లాదిమిర్‌ పుతిన్‌ నిన్న గుర్తించడంతో రష్యా, నాటో దళాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో ఇరువైపులా సంయమనం పాటించాలని భారత్‌ పిలుపునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని