Salman Khan: సల్మాన్‌ ఖాన్‌, అమృత ఫడణవీస్‌లకు వై+ భద్రత

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌(Salman Khan), మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత ఫడణవీస్‌లకు Y+ గ్రేడ్‌ భద్రత కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

Published : 01 Nov 2022 15:41 IST

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్‌ స్టార్‌లు సల్మాన్‌ఖాన్‌(Salman Khan), అక్షయ్‌కుమార్‌లకు భద్రత కల్పించింది.  నటుల కుటుంబాలకు పొంచి ఉన్న ప్రమాదంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం ఇచ్చిన  సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌కు Y+ గ్రేడ్‌ భద్రతను కల్పించగా.. అక్షయ్‌కుమార్‌కు X కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతంలో నిందితుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి సల్మాన్‌కు వచ్చిన బెదిరింపులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయనకు ప్రస్తుతం ఉన్న ఎక్స్‌ గ్రేడ్‌ భద్రతను Y+గా అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డ్‌లు సల్మాన్‌కు అనునిత్యం భద్రతగా ఉండనున్నారు. ఇంటి వద్ద కూడా ఇద్దరు భద్రతా సిబ్బంది నిత్యం పహారా కాస్తారు.

అలాగే, అక్షయ్‌ కుమార్‌కు వై కేటగిరీ భద్రత కింద మూడు షిఫ్ట్‌లలో ముగ్గురు భద్రతా అధికారులు రక్షణగా ఉండనున్నారు. ఇంకోవైపు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత ఫడణవీస్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్‌ భద్రత కల్పించింది. 

శిందే వర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వై+...

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలకు వై+ భద్రతను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయించిన విషయం తెలిసిందే. కొత్త సర్కారు ఏర్పడిన మూడు నెలల తర్వాత కూడా ఈ స్థాయి భద్రతను కొనసాగించడం గమనార్హం. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహావికాస్‌ అఘాడీ(శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి) నాయకులు 25 మందికి ‘కేటగిరైజ్డ్‌ భద్రత’ను తొలగించింది. అయితే, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన కుటుంబ సభ్యులకు, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఆయన కుటుంబ సభ్యులకు కేటాయించిన భద్రతలో మార్పు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని