Sanjay Raut: చివరకు దర్జీని కూడా ఈడీ విచారిస్తోంది..!

మహారాష్ట్రలోని మహా వికాస్ అగాఢీ (ఎంవీఏ)ప్రభుత్వాన్ని కూలదోయడానికి కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని శివసేన నేత సంజయ్ రౌత్ మరోసారి విమర్శించారు.

Published : 16 Feb 2022 23:10 IST

భాజపాపై సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు

ముంబయి: మహారాష్ట్రలోని మహా వికాస్ అగాఢీ (ఎంవీఏ)ప్రభుత్వాన్ని కూలదోయడానికి కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని శివసేన నేత సంజయ్ రౌత్ మరోసారి విమర్శించారు. ఆ పార్టీ.. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో సహా పలువురు నేతల్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపణలు గుప్పించారు. ముంబయిలో మీడియా సమావేశంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నన్ను లక్ష్యంగా చేసుకొని, నా సన్నిహితులపై ఏజెన్సీలు దాడులు నిర్వహించాయి. దాంతో అదే రోజు నేను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఫోన్ చేసి మాట్లాడాను. మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు దేశంలో అగ్రనేత. కేంద్ర హోంమంత్రి. కానీ, ఇప్పుడు జరుగుతున్నది సరైంది కాదు. మీకు నాపైన పగ ఉంటే నన్ను టార్గెట్ చేయండి. నాకు సంబంధించిన వారిని హింసించకండి. వారినెందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అని ప్రశ్నించినట్లు రౌత్‌ వెల్లడించారు.

అలాగే తన కుమార్తె వివాహానికి సంబంధించి అలంకరణ చేసిన వ్యక్తిని, బ్యుటీషియన్‌ను, చివరకు దర్జీని కూడా ఈడీ విచారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ఎన్ని వ్యూహాలు పన్నినా.. ఎంవీఏ నేతలు లొంగరని స్పష్టం చేశారు. అలాగే ‘గత నెల కొందరు భాజపా నేతలు నన్ను కలిశారు. పార్టీ మారమన్నారు. అలా చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటావని బెదిరించారు’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. స్పందించకుంటే ఏజెన్సీలు ఆ పని చూసుకుంటాయని, గతంలో ఓ నేతకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావించారన్నారు. ఆ తర్వాత నుంచే తన సన్నిహితులపై అమర్యాదకరమైన రీతిలో దాడులు జరిగాయని తెలిపారు. భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ ఎంవీఏ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ఎట్టిపరిస్థితుల్లో ఫలించవని మండిపడ్డారు. కాగా ఈ వ్యాఖ్యలపై భాజపా నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. ఈ ఆరోపణలకు సరైన సమయంలో సమాధానమిస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని