NEET Exam: నీట్ పరీక్ష ఆదివారమే.. వాయిదా వేయడం కుదరదన్న సుప్రీం

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌(యూజీ)-2021 పరీక్షను వాయిదా వేయడం లేదా రీషెడ్యూల్‌ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను

Updated : 06 Sep 2021 16:10 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌(యూజీ)-2021 పరీక్షను వాయిదా వేయాలని లేదా రీషెడ్యూల్‌ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ముందుగా చెప్పిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 12, ఆదివారమే నీట్‌ పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది.

సెప్టెంబరు 12న నీట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజున ఇతర పోటీ పరీక్షలు ఉండటంతోపాటు సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు కూడా జరుగుతున్నాయని, అందువల్ల పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని కోరుతూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘ఈ పిటిషన్లను మేం స్వీకరించట్లేదు. నీట్‌ పరీక్షను 16లక్షల మందికి పైగా విద్యార్థులు రాయనున్నారు. కేవలం కొంతమంది విద్యార్థుల కోసం పరీక్షను వాయిదా వేయలేం. విద్యా వ్యవహారాలపై మేం ఎక్కువగా జోక్యం చేసుకోలేం. ఎందుకంటే మా తీర్పుల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రభావితమవుతారు. ఒకవేళ ఒకే రోజు ఎక్కువ పరీక్షలు ఉంటే.. ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. అంతేగానీ, నీట్‌ను వాయిదా వేయడం కుదరదు. సెప్టెంబరు 12నే పరీక్ష జరుగుతుంది’’ అని కోర్టు స్పష్టం చేసింది.

కరోనా ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది నీట్ పరీక్ష ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మహమ్మారి వ్యాప్తితో మేలో జరగాల్సిన పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. దీంతో నీట్‌ను ఆగస్టు 1న నిర్వహిస్తామని గతంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. అయితే అప్పటికీ వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగానే ఉండటంతో షెడ్యూల్‌లో మార్పులు చేసి సెప్టెంబరు 12న పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెన్‌ అండ్‌ పేపర్‌ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని