Supreme Court: యూట్యూబ్‌ నుంచి పరిహారం కోరుతూ పిటిషన్‌.. పిటిషనర్‌కు సుప్రీం ఫైన్‌!

యూట్యూబ్‌ (Youtube) ప్రకటనల వల్ల తాను పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయానంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును (Supreme court) ఆశ్రయించాడు. తనకు పరిహారం ఇప్పించాలని కోరాడు.

Published : 09 Dec 2022 17:43 IST

దిల్లీ: యూట్యూబ్‌లో (Youtube) వచ్చే ప్రకటనల వల్ల తన దృష్టి మరలి పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయానంటూ ఓ పిటిషనర్‌ సుప్రీంకోర్టును (Supreme court) ఆశ్రయించాడు. అందుకు ప్రతిగా యూట్యూబ్‌ నుంచి తనకు రూ.75 లక్షలు పరిహారంగా (Compensation) ఇప్పించాలని కోరాడు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం సమయాన్ని వృథా చేసినందుకు గానూ జరిమానా (Fine) విధించింది.

యూట్యూబ్‌లో ప్రకటనల వల్ల తాను పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయానంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి సుప్రీకోర్టును ఆశ్రయించాడు. పోటీ పరీక్షల కోసమని తాను యూట్యూబ్‌ ఛానెల్‌కు సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే ప్రకటనల్లో భాగంగా వచ్చే సెక్సువల్‌ కంటెంట్‌ వల్ల తన ఏకాగ్రతకు భంగం కలుగుతోందని పేర్కొన్నాడు. దీనివల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్నానంటూ పిటిషన్‌ వేశాడు. అలాగే, సోషల్‌ మీడియాలో నగ్న వీడియోలను నిషేధించాలనీ కోరాడు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఏఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇలాంటి పిటిషనర్ల వల్లే న్యాయస్థానాల సమయం వృథా అవుతోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకవేళ ప్రకటన నచ్చకపోతే వీక్షించడం మానేయాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది.

కేవలం పబ్లిసిటీ కోసం కోర్టును ఆశ్రయించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు సమయం వృథా చేసినందుకు గానూ రూ.1 లక్ష జరిమానాగా చెల్లించాలని కోర్టుకు నేరుగా హాజరైన ఆ వ్యక్తిని ఆదేశించింది. అయితే, తానొక నిరుద్యోగిని వేడుకోవడంతో జరిమానాను రూ.25 వేలకు తగ్గించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని