సాయిబాబా కేసును మరోసారి విచారించండి.. బాంబే హైకోర్టు తీర్పు పక్కనపెట్టిన సుప్రీం

దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబా (professor Saibaba) కేసును పునర్విచారించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు బాంబే హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. 

Updated : 19 Apr 2023 14:06 IST

దిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై నమోదైన కేసు(Maoist links case)లో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబా (professor Saibaba)ను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు(Bombay High Court)ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) పక్కన పెట్టింది. ఆ కేసును మరోసారి విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. 

దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో 90% వైకల్యంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైన సాయిబాబాను మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టింది. 2017లో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు.. సాయిబాబా సహా ఇతర నిందితులకు జీవితఖైదు విధించింది. దీనిపై వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు తన తీర్పులో.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని సెక్షన్‌45(1) ప్రకారం సాయిబాబా విచారణకు అవసరమైన అనుమతి తీసుకోలేదని, అందువల్ల ఆయనపై జరిగిన మొత్తం విచారణను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. 

ఈ తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాలు చేసింది. వాదనల అనంతరం హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. నాలుగు నెలల్లో మెరిట్ ఆధారంగా మళ్లీ సాయిబాబా కేసును విచారించాలని ఆదేశించింది. గతంలో నిర్దోషిగా ప్రకటించిన ధర్మాసనంతో కాకుండా మరో ధర్మాసనంతో విచారణ జరిపించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని