Published : 23/11/2020 09:27 IST

‘రెండో విడత విజృంభణ అంటే సునామీనే’

మహారాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసిన సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబయి: మహారాష్ట్రలో కరోనా నియంత్రణలోకి వస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. గడిచిన పండగ సీజన్‌లో ప్రజలు సంయమనం పాటించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అయినా, ప్రజలు భద్రతా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 

‘‘చాలా జాగ్రత్తగా పండుగలు జరుపుకొన్నాం. దీపావళి సమయంలో టపాసులు పేల్చొద్దన్న నా విజ్ఞప్తిని అందరూ మన్నించారు. అందుకే కొవిడ్‌పై చేసిన మన పోరాటం ఫలిస్తోంది. కానీ, నాకు మీపై(ప్రజలు) కాస్త కోపం ఉంది. దీపావళి తర్వాత రద్దీ ఎక్కువగా ఉంటుందని నేను ముందే చెప్పాను. అయినా, చాలా మంది మాస్కులు ధరించకుండానే తిరగడం చూశాను. కొవిడ్‌ ఇక అయిపోయిందని ఎవరూ అనుకోవద్దు. పాశ్చాత్య దేశాలు, దిల్లీ, అహ్మదాబాద్‌లో వచ్చిన రెండో దశ వ్యాప్తి సునామీ అంత బలంగా ఉంది. అహ్మదాబాద్‌లో రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధిస్తున్నారు.’’ అంటూ ఉద్ధవ్‌ ప్రజలను అప్రమత్తం చేశారు. 

వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదని.. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదని ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. ఒకవేళ డిసెంబరులో ప్రజావినియోగానికి అందుబాటులోకి వచ్చినా మహారాష్ట్రకు ఎప్పుడు వస్తుందో చెప్పలేమన్నారు. ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని.. ఈ లెక్కన రాష్ట్రానికి 25 కోట్ల డోసుల అవసరం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో టీకా రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని.. అప్పటి వరకు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మరోసారి లాక్‌డౌన్‌ విధించాలన్న ఆలోచన తనకు లేదని.. ఆ దిశగా పరిస్థితులు తీసుకెళ్లొద్దని కోరారు. ఆలయాల్లో ప్రజలు గుమికూడొద్దని సూచించారు. 

దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అక్కడ కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తొలి ఐదు రాష్ట్రాల్లో కేవలం మహారాష్ట్రలోనే క్రియాశీలక కేసుల సంఖ్య గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల కేసులు నమోదైనా.. ప్రస్తుతం 82 వేల మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 5,753 కేసులు వెలుగుచూడగా.. 4,060 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని