vaccine: భారత్‌ వెలుపలా కొవిషీల్డ్‌ ఉత్పత్తి?

దేశవ్యాప్తంగా కరోనా టీకాల కొరత ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండు టీకాల తయారీ సంస్థలు డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి..........

Published : 01 May 2021 12:31 IST

ఓ ఇంటర్వ్యూలో సీరం సీఈఓ అదర్‌ పూనావాలా

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకాల కొరత ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండు టీకాల తయారీ సంస్థలు డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్‌ టీకా ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కీలక చర్యలు చేపట్టినట్లు సమాచారం. భారత్‌ వెలుపలా కొవిషీల్డ్‌ తయారీని చేపట్టాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా ‘ది టైమ్స్‌’కి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో తెలిపారు. దీనికి సంబంధించి రానున్న కొన్ని రోజుల్లో ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు.

జులై నాటికి సీరం నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 మిలియన్‌ డోసులకు పెంచనున్నట్లు పూనావాలా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే రానున్న ఆరు నెలల్లో సంస్థ వార్షిక తయారీ సామర్థ్యాన్ని 2.5-3 బిలియన్ల డోసులకు పెంచుతామని పూనావాలా తెలిపినట్లు టైమ్స్ పేర్కొంది.

బారత్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు 3.5 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో ఆసుపత్రులకు తాకిడి పెరిగి ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. మే 3-5 మధ్య కేసులు తారస్థాయికి చేరే అవకాశం ఉందని ఓ నిపుణుల బృందం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మహమ్మారి అంతానికి టీకా ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడతున్నారు. మరోవైపు నేటి నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందించే కార్యక్రమం ప్రారంభమైంది. కానీ, టీకాల కొరత కారణంగా మెజారిటీ రాష్ట్రాలు 18 ఏళ్లు పైబడినవ వారందరికీ ఇప్పుడప్పుడే టీకాలు అందించలేమని తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని