Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్‌ అరెస్టు

ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాల హత్య కేసులో కీలక షార్ప్‌షూటర్‌ను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మూసేవాల హత్యకేసులో మరింత పురోగతి సాధించినట్లైంది.

Published : 05 Jul 2022 02:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాల హత్య కేసులో కీలక షార్ప్‌షూటర్‌ను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మూసేవాల హత్యకేసులో మరింత పురోగతి సాధించినట్లైంది. మూసేవాలాపై కాల్పులు జరిపిన నలుగురిలో అంకిత్‌ శిర్సా కీలకమైన వ్యక్తి. అతడిని నిన్న దిల్లీలోని కశ్మీరగేట్‌ బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు. అతడితోపాటు మరికొందరు షూటర్లకు ఆశ్రయం ఇచ్చిన సచిన్‌ భివానీ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొన్నట్లు దిల్లీ స్పెషల్‌ సెల్‌ కమిషనర్‌ హర్‌గోబింధర్‌ దాలివాల్‌ పేర్కొన్నారు.

మూసేవాల హత్యలో పాల్గొన్న షూటర్లలో అంకిత్‌ చిన్నవాడు. అతడు సోనిపట్‌ వాసి. అంకిత్‌పై రాజస్థాన్‌లో రెండు హత్యాయత్నం కేసులు ఇప్పటికే ఉన్నాయి. ఇక లార్సెన్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రాజస్థాన్‌లో కార్యకలాపాలను సచిన్‌ పర్యవేక్షిస్తున్నాడు. షూటర్లు మొత్తానికి అతడే ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 

నిందితుల నుంచి ఒక 9ఎంఎం బోర్‌ బిస్టోల్‌, 10 లైవ్‌ కార్టరిడ్జ్‌లు, 0.30 తుపాకీ స్వాధీనం చేసుకొన్నారు. వీటితోపాటు పంజాబ్‌ పోలీసుల యూనిఫామ్‌, రెండు మొబైల్‌, ఒక సిమ్‌, ఒక డాంగిల్‌ కూడా దొరికాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గుట్టల కొద్దీ ఆయుధాలు దొరుకుతున్నాయి. గత నెలలో అరెస్టులు జరిగిన సమయంలో 8 గ్రనేడ్‌లు, తొమ్మిది ఎలక్ట్రానిక్‌ డిటోనెటర్లు, మూడు పిస్తోళ్లు, ఒక రైఫిల్‌ను స్వాధీనం చేసుకొన్నారు. 

మే 29వ తేదీన శుభ్‌దీప్ సింగ్‌ సిద్ధూ అలియాస్‌ సిద్ధూ మూసేవాలను స్వగ్రామంలో దుండగులు కాల్చి చంపారు. ఈ కేసుకు సంబంధించి దిల్లీ పోలీసులు ప్రియవ్రత్‌ ఫౌజీ, కషీష్‌, కేశవ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. కెనడాకు చెందిన డాన్‌ గోల్డీ బ్రార్‌ ఈ హత్యకు బాధ్యత తీసుకొన్నాడు. ఇతడు కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ లార్సెన్‌ బిష్ణోయ్‌కు అత్యంత సన్నిహితుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని