Road Accidents: డ్రైవర్‌కు నిద్రమత్తు వదిలించే కళ్లజోడు

నిద్రమత్తు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి సరికొత్త పరికరాన్ని రూపొందించాడు. డ్రైవర్‌  నిద్రమత్తులో ఉన్నప్పుడు అతడిని అలర్ట్‌ చేసేలా ‘లైఫ్‌లైన్‌’ అనే కళ్లజోడును తయారు చేశాడు. ఈ పరికరం పెద్ద శబ్దం చేస్తూ అతని కళ్లకు వైబ్రేషన్‌ ఇచ్చి మేల్కొలుపుతుందని తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్మయి తెలిపాడు....

Published : 02 Nov 2021 23:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నిద్రమత్తు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి సరికొత్త పరికరాన్ని రూపొందించాడు. డ్రైవర్‌  నిద్రమత్తులో ఉన్నప్పుడు అతడిని అలర్ట్‌ చేసేలా ‘లైఫ్‌లైన్‌’ అనే కళ్లజోడును తయారు చేశాడు. ఈ పరికరం పెద్ద శబ్దం చేస్తూ అతని కళ్లకు వైబ్రేషన్‌ ఇచ్చి మేల్కొలుపుతుందని తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్మయి తెలిపాడు. భవిష్యత్‌లో కళ్లజోడు లేకుండా చిన్నసైజులో లైఫ్‌లైన్‌ను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

దేశ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ప్రమాదాల కారణంగా ఏటా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అనేకమంది గాయాలపాలవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి వాహనాన్ని అదుపు చెయ్యలేక జరిగే ప్రమాదాల సంఖ్యే అధికం. అలా నిద్రమత్తు నుంచి మేల్కొలిపేందుకు కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి సరికొత్త పరికరాన్ని రూపొందించాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని శిశిర గ్రామానికి చెందిన చిన్మయిగౌడ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాల జాతీయ రహదారికి సమీపంలో ఉంది.అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుండటం గమనించాడు. డ్రైవర్‌ నిద్రమత్తే అధిక ప్రమాదాలకు కారణమని ఉపాధ్యాయుల నుంచి తెలుసుకున్న చిన్మయి.. దాని కోసం పరిష్కారం వెతకాలనుకున్నాడు. డ్రైవర్‌ను మేల్కొలిపేలా పరికరం తయారీకి సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సేకరించాడు. వెంటనే దానికి అవసరమైన ఓ కూలింగ్‌ గ్లాస్‌, నానో చిప్‌, మినీ సౌండ్‌ బజర్‌, వైబ్రేటర్‌, చిన్నసైజు బ్యాటరీని ఆర్డర్‌ చేశాడు. వీటిని ఉపయోగించి లైఫ్‌లైన్‌ అనే కళ్లజోడు రూపొందించాడు.

ఈ కళ్లజోడును వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్‌ పెట్టుకుంటే అతడ్ని అలర్ట్‌ చేస్తుందని చిన్మయి తెలిపాడు. డ్రైవర్‌ రెండు సెకెన్లకు మించి కళ్లు మూసుకొని ఉంటే.. వెంటనే పరికరం నుంచి పెద్ద  శబ్దం వస్తుందని చెప్పాడు. డ్రైవర్‌ కళ్లకు సైతం చిన్నపాటి వైబ్రేషన్‌ ఇస్తుందని, దీంతో వెంటనే వాళ్లు అలర్ట్‌ అవ్వడానికి వీలుంటుందని వివరించాడు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను అరికట్టే అవకాశం అధికంగా ఉందని చెప్పాడు. కళ్లజోడు వల్ల రాత్రి సమయంలో లైట్‌ఫోకస్‌ అధికంగా పడే అవకాశముందని చిన్మయిగౌడ అంటున్నాడు. దానికోసం కళ్లజోడు లేనివిధంగా చిన్నసైజులో ఈ లైఫ్‌లైన్‌ పరికరం తయారు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని