ఎవరైనా అలాగే అనుకుంటారు.. అందులో కొత్తేముంది?: సుప్రియా సూలే

మహారాష్ట్రలో తదుపరి ముఖ్యమంత్రి తమ పార్టీకి చెందినవారే అవుతారంటూ ఇటీవల ఎన్సీపీ నేత ధనుంజయ్‌ ముండే చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ సుప్రియా......

Published : 06 Jun 2022 17:52 IST

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలో తదుపరి ముఖ్యమంత్రి తమ పార్టీకి చెందినవారే అవుతారంటూ ఇటీవల ఎన్సీపీ నేత ధనుంజయ్‌ ముండే చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఏ నేత అయినా తమ పార్టీకి చెందినవారే సీఎం కావాలని కోరుకుంటారనీ.. అందులో కొత్తేమీలేదన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం శివసేన అగ్రనేత ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలో కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కీలక భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ముఖ్యమంత్రి అంశంపై ధనుంజయ్‌ ముండే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడంతో దీనిపై సూలే క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘‘ఏ కార్యకర్తయినా/నేత అయినా/అనుచరులైనా తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. ఇది సర్వసాధారణం. ఇందులో కొత్తేమీ లేదు’’ అని ఆమె చెప్పారు.

రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కావాల్సింది!

మహారాష్ట్రలో ఈ నెల 10న ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, అధికార కూటమి 4 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించగా.. ప్రధాన ప్రతిపక్షం భాజపా ఇద్దరిని పోటీలో పెట్టింది. దీంతో ఈ ఎన్నికల్లో బేరసారాలు జరిగే అవకాశాలపై విలేకర్లు ప్రశ్నించగా.. ‘‘ఇలాంటివి దురదృష్టకరం. ఆరు స్థానాలకు నామినేషన్లు వేసిన వారు ఏకగ్రీవంగా ఎన్నిక కావాల్సింది. ఈ ఎన్నికల్లో పోటీలేకుండా ఉండేలా మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వ కూటమికి చెందిన నేతలు కొందరు భాజపా సీనియర్‌ నేతలను కలిశారు. పోటీ లేకుండా చేసేందుకు ప్రయత్నించారు’’ అన్నారు. అయితే, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న కొందరు రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు సహకరించే అవకాశం ఉందంటూ జరుగుతున్న ఊహాగానాలపైనా సుప్రియా సూలే స్పందించారు. అలాంటివి సీరియస్‌గా పరిగణించాలని.. అధికార కూటమి నేతలు దీనిపై చర్చిస్తారన్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటేస్తారా?

ప్రస్తుతం జైలులో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు అనిల్‌ దేశ్ ముఖ్‌, నవాబ్‌మాలిక్‌ ఓటు వేసేందుకు వస్తారా? అని విలేకర్లు ఆమెను ప్రశ్నించగా.. ‘‘ఏ తప్పూ చేయకుండా వాళ్లిద్దరూ జైలులో ఉన్నారు. న్యాయవ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది. వారికి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. ఎన్సీపీ నేత ఛగన్‌ భుజ్‌బల్‌ వారిద్దరికీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు’’ అన్నారు. అలాగే, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అవినీతి కేసులో సస్పెండైన పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే అప్రూవర్‌గా మారడంపైనా ఆమె స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన్‌ వాజే అప్రూవర్‌గా మారారు. ఎలాంటి ఆరోపణలూ లేని వ్యక్తి (నవాబ్‌ మాలిక్‌) ఇంట్లో 109 సార్లు సోదాలు జరిగాయి. ఇలాంటివి గతంలో ఎప్పుడైనా చూశామా? ఇదో రికార్డు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది’’ అని సూలే మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని